మేం చంద్ర‌బాబుపై దాడి చేయించామా?

పోలీస్ లే దగ్గరుండి త‌మ అధినేత అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌లో చెప్పులు ,రాళ్లు వేయించారని తెదేపా నాయకులు  ఆరోపించడం తగద‌ని  పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మీడియాకు చెప్పారు. శ‌నివారం ఆయ‌న మీడియాలో మాట్లాడుతూ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సందర్శన సమయంలో నిరసనకారులు ఆయన మీద చెప్పులు రాళ్లు విసిరిన స‌మ‌యంలో  పోలీసులు వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకున్న విష‌యాన్ని టిడిపి నేత‌లు గ‌మ‌నించ కుండా ఈ త‌తంగం ఏకంగా డిజిపి నేతృత్వంలో జ‌రిగిందంటూ ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబని ప్ర‌శ్నించారు.


చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ఉద్రిక్తంగా మారుతుంద‌ని ముందే అనుకున్నామ‌ని, అయితే ఆత‌ని పర్యటనకు అనుమతివ్వకపోతే వాక్ స్వాతంత్య్రం అడ్డుకుంటున్నారని మాట్లాడతార‌నే అనుమ‌తించామ‌ని చెప్పారు.  ఏదైనా చిన్న విషయం జరిగితే దాన్ని పోలీస్ లపై ఆపాదించడం స‌మేతుకం కాదని,,  పోలీస్ వ్యవస్థలో ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసి, నిర్వీర్యం చేయాలనా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నా రని ప్ర‌శ్నించారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, ప్రజాదరణ  ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రిపై మేము దాడి చేయిస్తామా?  మీ హ‌యాంలోనూ ప‌నిచేసిన అధికారులే ఇప్పుడు ఉన్న విష‌యం గ్ర‌హించాల‌ని ఆయ‌న టిడిపి నేత‌ల‌కు సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు.


అయితే చంద్ర‌బాబుపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా, పోలీస్ స్టేష‌న్ నుంచి వైసిపి నేత‌లు తీసుకు వెళ్లి పోయిన విష‌యం ప్ర‌శ్నిస్తే, ఆ విష‌యం త‌న దృష్టికి రాలేద‌ని చెప్పారు శ్రీ‌నివాస్‌.

Leave a Reply

Your email address will not be published.