మరోసారి కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్ తెర‌పైకితెలంగాణ ముఖ్యమంత్రి.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోసారి ఫెడరల్ ఫ్రంట్ ని తెర‌పైకి తీసుకు రావాల‌ని భావిస్తున్న‌ట్టు టిఆర్ ఎస్ నేత‌ల నుంచి తెలియ‌వ‌స్తోంది. ఈ మ‌ధ్య జ‌రిగిన ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల‌లో బిజెపి దిగాలు ప‌డ‌టంతో, పాటు ఇటీవ‌ల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలను త‌న జాతీయ రాజ‌కీయాల‌కు వేదిక చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేప‌థ్యంలో త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కు ఊపిరులూద‌టం ద్వారా జాతీయ రాజ‌కీయాల‌లో కీల‌క భూమిక పోషించేందుకు కేసీఆర్ మ‌రోమారు త‌న ప్ర‌య‌త్నాలు ఆరంభించార‌ట‌. ఈ క్ర‌మంలోనే పౌరసత్వ సవరణ చట్టంపై యావద్దేశం నిరసనలతో వేడెక్కిన రాజకీయాలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ తో ఇటీవ‌ల చ‌ర్చించారు. ఈ చ‌ట్టం తెలంగాణ‌లో అమ‌లు చేయ‌ద్ద‌ని కోరిన సంద‌ర్భంగా ఇతర రాజకీయ పార్టీలతో సమావేశం అవుతామని సీఎం కేసీఆర్ చెప్పారని ఓవైసీ ప్రకటించిన విష‌యం విదిత‌మే.


దీనికి తోడు ముంద‌స్తు ఎన్నిక‌ల‌లో టిఆర్ఎస్ పార్టీ అధికారం అందుకోగా ఆపై జ‌రిగిన లోక్ స‌భ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ‌లో నాలుగు సీట్లు కైవ‌సం చేసుకోవ‌టం తో బీజేపీ దూకుడు పెంచింది. తెలుగుదేశం, కాంగ్రెస్‌ల‌తో పాటు టిఆర్ ఎస్ పార్టీకి చెందిన అస‌మ్మ‌తి వాదుల‌ను చేర్చుకుంటూ కాంగ్రెస్ స్థానంలో టిఆర్ ఎస్‌కు ధీటుగా నిల‌చే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ వ్య‌వ‌హారం గ‌త కొంత‌కాలంగా కేసీఆర్‌కి త‌ల‌నొప్పిగా మారింది. బిజెపికి చెక్ చెప్ప‌డం ద్వారానే ఫ‌లితాలందుకోవ‌టంతో పాటు కేటీఆర్ ప‌ట్టాభిషేకం త‌న జాతీయ రాజ‌కీయ ప్ర‌వేశం రెండూ జ‌రిగేందుకు వీలుగా వ్యూహాలు ర‌చిస్తున్నార‌ట కేసీఆర్‌.ఈ క్ర‌మంలోనే జనవరి 30వ తేదీన మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్‌ గాంధీ కావాలా.. గాడ్సే కావాలా నినాదంతో హైదరాబాద్‌లో బిజెపి వ్య‌తిరేకంగా భారీ బహిరంగ సభ నిర్వహించ‌నున్న‌ట్టు స‌మాచారం. దేశంలోని బిజెపి మిన‌హా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించాలని కేసీఆర్ భావిస్తున్నార‌ని, ఇప్ప‌టికే ఈ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయ‌ని, ఢిల్లీలో నేత‌ల‌తో మాట్లాడే ప‌ని ప‌లువురు నేత‌ల‌కు అప్ప‌గించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి. మ‌రి ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.