ఆ రెండు కేసుల్లో జగన్ ఎందుకలా? (స్పెషల్ స్టోరీ )


ఇలాంటి ఉపోద్ఘాతం ఇవ్వడానికి కారణం ముఖ్యమంత్రి జగన్ సొంత చిన్నాన అకాల మరణంపై ఆ పార్టీ నేతలు ముందో మాట… వెనకో మాట… అధికారంలోకి వచ్చాక ఇంకో మాట మాట్లాడుతుండటం చివరకి కుటుంబ సభ్యులకి, రక్త సంబధీకులకు కూడా నమ్మకం పోయేలా ఉండటమే..
నిజమే… దివంగత వైఎస్ వివేకా సతీమణి ఆవేదనలో అర్ధం ఉంది. సొంత వ్యక్తులు అధికారంలో ఉన్నప్పటికీ తమకు న్యాయం జరగటం లేదన్న ఆందోళన సమంజసమైనది కూడా … రాత్రి పడుకునే ముందు తనతో హాయిగా వున్నానని చెప్పిన వ్యక్తి తెల్లారే సరికి రక్తపు మడుగులో ఈ లోకాన్ని విడిచిన వ్యక్తి విషయంలో ఏం జరిగిందన్నది ఇంత కాలమైనా తేలక పోవటంపై సౌభాగ్యమ్మ ఆందోళన చెందుతోంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వివేక హత్యపై సిట్ దర్యాప్తును అంగీకరించని నాటి విపక్ష నేత, నేటి సిఎం జగన్, వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ వేరువేరుగా అప్పుడు సిబిఐ దర్యాప్తు కావాలని హైకోర్టులో రిట్లు వేసారు. అయితే అధికారంలోకి రాగానే ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్‌ని మార్చేసి, తన వెంట ఉండే పోలీసు అధికారులతో మరో సిట్ ఏర్పాటు చేసారు. అయితే ఈ కేసు దర్యాప్తును సైతం తన సొంత ప్రయోజనాలకోసం వాడుకుంటూ, విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారన్న అపప్రద మూటగట్టుకున్నా, కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
రోజురోజుకీ ఈ కేసు మలుపులమీద మలుపులు తిరుగుతూ.. ‘ డీలా ‘ పడుతుండగా ఈ ఘటనను ఎలా డీల్ చేయాలో తెలియక.. ప్రభుత్వం తల పట్టుకుంటోంది. సిట్ విచారణలో నిందితులుగా పేర్కొన్న ఎర్ర గంగిరెడ్డి, ప్రకాష్, మరొకరికి నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించారు. ఇటీవలే మరో నిందితుడు శ్రీనివాసులురెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే పోలీసులు తనను వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వచ్చాయి.
`హతమార్చిందెవరో తుమ్మలపల్లి గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డి, ములి వెంకటకృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాశ్లకు తెలుసు. హత్య చేసిన వారిని చట్టం నుంచి తప్పించేందుకు వీరు ముగ్గురు ఉద్దేశపూర్వకంగానే ఘటనాస్థలం నుంచి సాక్ష్యాధారాలను తుడిచేశారు’ అని రిమాండు రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అంతకు మించి అసలు వివేకాను హతమార్చిందెవరు? చేయించింది ఎవరో మాత్రం ఇప్పటికీ తేల్చలేకపోయారు.
ఈ క్రమంలోనే మరోమారు సౌభాగ్యమ్మ తన భర్త మరణంపై దర్యాప్తు సిబిఐతో చేయించాలని కోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు అవసరమే లేదని వైసిపి ప్రభుత్వం తన ఏజి ద్వారా కోర్టుకు చెప్పడం వారిని అవాక్కయ్యేలా చేసింది.
కేసులో అనుమానం ఉన్న వాళ్లు ఏ పార్టీ వారు అయినా పోలీసులు విచారణ చేస్తున్నారని, రాగద్వేషాలకు అతీతంగానే దర్యాప్తు జరుగుతోందని ఎజి చెప్పారు. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఏకపక్షంగా ఉందని, కావాలనే కొందరిని లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు చేస్తోందన్నారు. గతంలో విపక్ష నేతగా ఉండగా జగన్, వివేకా భార్య సౌభాగ్యమ్మ సిబిఐ దర్యాప్తు కోసం వేసిన రిట్లు వేశారని నేటికీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని సౌభాగ్యమ్మ తరపు న్యాయవాదులు చెప్పారు.
దీంతో అధికారంలోవున్నది తమ కుటుంబానికి చెందిన వ్యక్తే అయినా నాకీ ప్రభుత్వం మీద నమ్మకంలేదని స్పష్టం చేసిందంటే మనంఅర్ధంచేసుకోవచ్చు. ఏజితో కోర్టులో చెప్పించిన లెక్క ప్రకారం జగన్‌కు ఈ కేసు సిబిఐతో దర్యాప్తు చేయించడం సుతారం ఇష్టంలేదని, సిబిఐ దర్యాప్తు లోతుగా చేస్తే ఎటు తిరిగి ఎటు వెళ్తుందో, ఎవరి మెడకు చుట్టుకుంటుందో అన్న ఆందోళనే ఇందుకు కారణమని చెపుతున్నారు. దివంగత వివేకా హత్యకేసు సిబిఐకి ఇవ్వాలని సాక్ష్యాత్తు ఆయన సతీమణి కోరుతుంటే వారి వారి ఉమ్మడి ప్రయోజనాలు ఏమైనా వున్నాయేమో అన్న మాట అడ్వకేట్ జనరల్ వాడరన్న విషయం తెలిసి అసలు ఏం జరుగుతుందన్నదానిపై అందరిలో మరింత కుతూహలం పెరిగిందన్నది నిజం.
మొదట డ్రైవర్‌పై అనుమానం వ్యక్తంచేశారు. వివేకా రాసినట్టు ఓ లేఖను బైటపెట్టారు. ఈ కేసులో చాలా రకాలైన ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అయితే అమాయకులను ఈ కేసులో నిందితులుగా మారే ప్రమాదం వుందన్న సంగతిని గ్రహించిన సౌభాగ్యమ్మ ఇప్పుడు తననిర్ణయాన్ని గట్టిగా చెబుతున్నారని కూడ అంటున్నారు. ప్రభుత్వం వచ్చి, ఏడు నెలలు గడుస్తున్నా స్వయానా తన చిన్నాన్న కేసే ఓ కొలిక్కిరాలేదన్న బాధ ఆమెలో వుందన్నది ఈ సంఘటనతో తేటతెల్లమైంది.
అసలు ఈ ఘటన జరిగిన సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నారు కనుక ఆతన్నీ విచారించాలని నోటీసులు పంపారు. ఈ కేసులో ఒక మాజీ ముఖ్యమంత్రి చెప్పేదేముంటుందో విచిత్రంగా వుంది. ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వంపై రకరకాల ఆరోపణలు కూడా చూశాం. గల్లీనుంచి డిల్లీదాకా ఆమె పిర్యాధులు చేస్తూ వచ్చారు.
సరే అప్పటి ప్రభుత్వం మాట అటుంచింతేే, అసలు జగన్ ప్రభుత్వం మీద నమ్మకంలేదని సాక్ష్యాత్తు ఆయన చిన్నమ్మ చెప్పడమే ఇప్పుడు సంచలనంగామారింది. ఎలాగైనా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ వైఎస్ సౌభాగ్యమ్మ తరుపు లాయర్లు వాదించారు. వారు ఇలా సిబిఐ విచారణకే పట్టుపట్టడంతో కలకలం రేగుతోంది.
ఇదే కేసులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై పలు ఆరోపణలు రాగా విచారణలకు హాజరవుతునే సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో ఏ చిన్న నిజముంటే, తాను ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరారు. సిబిఐచేత దర్యాప్తు చేస్తే మాత్రమే ఇది తేలుతుందని చెప్పారు. ఈ కేసు విషయంలో గతంలోనే అనేక రకాల వాదనలు వినిపించాయి. కుటుంబంలో చెలరేగిన కలహాల పుణ్యమే ఈ దారుణమన్న మాటలు కూడా వినిపించాయి.
వివేకా కుమార్తె సునీతారెడ్డి ,ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్.. తన బాబాయి వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ హత్యపై జగన్ ప్రభుత్వం యు-టర్న్ తీసుకున్నదనే అనుమానాలు సొంత కుటుంబంలోనే వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం ఈ హత్యలో తమ వైసీపీ కి చెందిన నేతకో, కార్యకర్తకో ప్రమేయం ఉందనే విషయం బయటపడితే అది ఈ పార్టీకి ఇరకాటపరిస్థితిని సృష్టిస్తుందన్న ఆందోళనా ఆ పార్టీలో లేకపోలేదు. అందుకే ప్రభుత్వం చేయిస్తున్న దర్యాప్తు ఒక్కఅడుగు కూడా ముందుకు పడలేదు. అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. ఎన్నికల ముందు సౌభాగ్యమ్మపై కుటుంబ సభ్యులంతా చేసిన ఒత్తిడి మూలంగానే ఆమె కొంత మౌనాన్ని ఆశ్రయించారని కూడా చెబుతున్నారు. దాంతో వారు ఏం చెబితే ఆమె కూడా అదే చెప్పేలా ఒత్తిడి తెచ్చారని ప్రచారం సాగింది. ఇలదిలా ఉంటే…
అంతెందుకు ఎన్నికల ముందు జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై దర్యాప్తు అధికారికి ఓ ఉన్నత పదవి ఇవ్వటం మినహా ఇప్పటి వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. . కోడి కత్తి కేసు అన్నది నిజమే అయితే, ఆయనపై హత్యాయత్నం జరిగిందే అయితే నిందుడికి శిక్షపడాలనే ఎవరైనా కోరుకుంటారు. నాటి ప్రభుత్వం చేసిన వాదనే బలంగా వుందని, దాన్ని మార్చే క్రమంలో అడుగులు వేసే క్రమం ఓ కొలిక్కి రాకనే విషయం తేల్చేలా వుండే ఇంతలా జాప్యానికి కారణమౌతుందన్న చర్చ ప్రధానంగా సాగుతోంది. నిజానికి జగన్ ప్రభుత్వం రాగానే తనపై హత్యాయత్నం జరిగిన కేసుపై ఎంతో సిరియన్ అవుతారని అనుకున్నారు.
అయితే జగన్ నాడు ఒక వ్యూహం ప్రకారమే నడుచుకున్నప్పటికీ ఇప్పుడు అధికారంలో వున్నది ఆయన కావడమే ఆ మౌనాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది. జగన్ ఉదాసీనతలో రెండు అర్ధాలు జ్వలింస్తున్నాయి. ఆ కేసు మూలంగానే తనపై ప్రజల్లో అపారమైనసానుభూతి వెల్లువ వచ్చి తాను అధికారంలోకి వచ్చేలా చేసినందునే ఆ వ్యక్తిపై కేసు రాకుండా, లేకుండా చూస్తున్నారా అన్నది ఒక చర్చ. అయితే ఏ వ్యక్తి అయినా తనపై ఒకసారి దాడికి దిగిన వ్యక్తిని ఉపేక్షించడం అన్నది ఎక్కడా జరగదు. ప్రతీకారం అన్నది లేకుండా ఎవరూ ఊరుకోరు. రాజకీయంగానే ఇంతలా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్, తనపై హత్యాయత్నంచేసిన వ్యక్తిని వదిలేయడం ఏమిటన్న చర్చకు కూడా ఆయనే తావిచ్చినట్లైందన్నది మాత్రం చేదు నిజం… ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా… ఈ రెండు కేసులలో సిబిఐ విచారణలకు జగన్ ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదన్నప్రశ్న గత కొంత కాలం నుంచి నానుతున్న ప్రశ్న. ఇక ముందుకూడా ససేమిరా అంటామనేందుకు తాజాగా ప్రభుత్వం కోర్టులో చేసిన వాదనలే ఉదాహరణ.