ప‌ల్లెప్ర‌గ‌తికి ఫ్ల‌యింగ్ స్వ్కాడ్సా..స‌ర్పంచుల‌కు సీఎం షాక్ మాములుగా లేదుగా?


తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు జ‌న‌వ‌రి 1 నుంచి  ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింప‌నున్నారు. ఇది ప్రజలకు కొత్త సంవత్సరంలో ఆయ‌న ఇచ్చే కానుక‌. ఇక వీళ్ళు చేయ‌బోయే ప‌నులు ఏమిటంటే… రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమాల పని తీరు, వాటి నాణ్యతను ఈ స్క్వాాడ్స్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రభుత్వానికి నివేదిక అందిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. పల్లె ప్రగతిపై ప్రగతి భవన్‌లో ఆదివారం (డిసెంబర్ 22) సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించి.. పల్లె ప్రగతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులకు స్పష్టం చేశారు.

‘30 రోజుల ఈ కార్యక్రమం జనాదరణ పొందింది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో సత్ఫలితాలను ఇవ్వడం సంతోషకరం. ప్రజలు చూపిస్తున్న ఉత్సాహాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు చూపట్లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ తనిఖీల ద్వారా దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది’ అని కేసీఆర్ అన్నారు.

ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో ఉండే  తనిఖీలు చేస్తామని కార్యక్రమం ప్రారంభంలోనే చెప్పినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పనితీరు మెరుగుపరుచుకోని అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు త‌ప్ప‌నిస‌రి అని ఆయ‌న హెచ్చ‌రించారు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే అన్ని స్థాయిల్లోని సిబ్బందికి వారు ఊహించని విధంగా పదోన్నతి కల్పించామని సీఎం పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శుల నియామకం చేపట్టడం నుంచి ఎంపీవో, ఎంపీడీవో, డీఎల్పీవో, డీపీవో, జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈవో అన్ని స్థాయిల్లో వ్యవస్థను పటిష్టపరిచామని ఆయ‌న మ‌రోసారి గుర్తు చేశారు.

‘ఇచ్చిన మాట ప్రకారం.. ప్రతి నెలా గ్రామాల అభివృద్ధికి రూ.339 కోట్లు ఠంచనుగా ప్రభుత్వం విడుదల చేస్తోంది. పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఆయా జిల్లా కలెక్టర్లకు నిరంతరం తగు సూచనలు ఇస్తున్నాం. పంచాయతీరాజ్ చట్టంలో కూడా కలెక్టర్లకు అధికారాలను దాఖలు పరిచాం. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత మెరుగుపర్చేందుకు పని వ్యవస్థలను పటిష్టం చేశాం. గ్రామ ఉద్యోగుల జీతాలు కూడా పెంచాం. ఇన్ని చర్యలు తీసుకున్న‌ప్ప‌టికి ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న వైఖ‌రిలో ప‌నులు జ‌రిగితే ఊరుకునేది లేదంటూ మొత్తం బాధ్య‌త‌ కలెక్టర్లు, సంబంధిత అధికారుల‌కే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

‘ఈ కార్యక్రమం ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు.. తనిఖీల ద్వారా నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయడమే దీని లక్ష్యం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ క్యాడర్ల నుంచి ఉన్నతాధికారులను నియమించి తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ప్రతి అధికారికి రాండమ్ పద్దతిలో వివిధ జిల్లాల్లోని 12 మండలాల చొప్పున ఆకస్మిక తనిఖీ కోసం బాధ్యతలను అప్పగిస్తాం. ఎవరికీ ఏ మండలాన్ని అప్పగిస్తామనేది ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది. విడతల వారీగా నిర్వహించే తనిఖీల ద్వారా పల్లె పురోగతి క్రాస్ చెక్ అవుతుంది. తద్వారా ప్రభుత్వానికి సరైన సూచనలు, సలహాలు అందుతాయి’ అని సీఎం అన్నారు. ఇది ప్రజాప్రతినిధుల పనితీరుకు ఓ పరీక్ష లాంటిదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అద్దంలా తీర్చిదిద్దే వరకు ప్రభుత్వం విశ్రమించదని స్పష్టం చేశారు. దీంతో ప‌ల్లె స‌ర్పంచ‌ల‌కు ఇది ఒక షాక్ అన్న‌ట్లే. 


Leave a Reply

Your email address will not be published.