శుక్రవారం కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకే….దేవినేని ఉమా

శుక్రవారం కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకే జగన్ పోలవరం పర్యటన పెట్టుకున్నారని ఎద్దేవా చేసారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. శుక్రవారం తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ అసలు పోలవరంలో పునాదులే పడలేదని నోటికొచ్చిన ఆరోపనలు చేసిన జగన్‌కి ఈ రోజు అక్కడ ఏం కనిపించిందో ప్రజలకు చెప్పాలని నిలదీసారు. పనులు ఎందుకు ఆగిపోయాయో? ఉండవల్లి చెప్పినట్టు పోలవరాన్ని తాపీగా చేస్తున్నారెందుకో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం పనులు గత ప్రభుత్వంలో పూర్తి కాకుంటే ఇప్పుడు టార్గెట్ 2021 అని ఎందుకు చెపుతారని అన్నారు.
టీడీపీ ప్రభుత్వంపై జగన్ ఎన్నో ఆరోపణలు చేశారని చివరికి రివర్స్ టెండరింగ్ పేరుతో కోట్లు మిగిల్చామని చెపుతూ పనులు సాగదీస్తున్నారని, దీని వల్ల నిర్మాణ వ్యయం పెరగదా? , వైసీపీ ప్రభుత్వ అలసత్వం వల్ల రూ. 2,500 కోట్లకు పైగా పోలవరంపై భారం పడిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రూ. 20 వేల కోట్ల దోపిడీ అని తమపై ఆరోపణలు చేసిన పోలవరం పనులలో ఏం గమనించారో ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారో ప్రజలు అర్ధం చేసుకోలేని అమాయకులు కారని అన్నారు.
ఓ వైపు కోర్టుకు డుమ్మాకొట్టి, మరో వైపు స్వామికార్యం స్వకార్యం పూర్తి చేసుకునేందుకు పోలవరం వెళ్లి దోపిడీకి శంఖుస్థాపన చేసారని ఎద్దేవా చేసారు దేవినేని. రూ. 500కోట్ల కుంభకోణానికి తెరలేపిన జగన్ ఇసుక, ఇతరత్రా పనులకు ఒకే సంస్థకు కట్టబెట్టేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారని., అధికారులు జగన్ చెప్పే పనులు చేసే ముందు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పరిస్థితి గుర్తుతెచ్చుకోని తదుపరి పనులు ఆరంభించాలని దేవినేని ఉమా సూచించారు.