ఏ రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టిన అనతికాలంలోనే ఇన్ని కేసులు ఎదుర్కొన్న సందర్భం లేదేమో. .!ముఖ్యమంత్రి హోదాలో కోర్టు కేసుల విచారణకు హాజరైన వారిలో బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండవ వారు అన‌టంలో సందేహం లేదు ఎవ్వ‌రికీ. కేవ‌లం దాణ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొని విచార‌ణలు జ‌రిగాక జైలు జీవితం అనుభ‌వించాల్సి వ‌చ్చింది లాలూ. ని చూసి చ‌ట్టం ముందు అంతా స‌మానులే అనిపించ‌క మాన‌దెవ్వ‌రికైనా…. 

నిజానికి ప్ర‌స్తుతం ఏపి ముఖ్య‌మంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గ్రహ స్థితి ఏంటో తెలియ‌దు కానీ ఆయ‌న రాజ‌కీయాల‌లోకి వ‌చ్చిన నాటి నుంచి ఆరోప‌ణలు, కోర్టులు, కేసులు ఇలా వ‌రుస‌గా వెంటాడుతున్నాయి. పరిటాల రవి హత్య కేసులో ప్రమేయంపై సిబిఐ కేసు విచార‌ణ ఎదుర్కొన్న ఆయ‌న వైఎస్ మ‌ర‌ణానంత‌రం అక్రమాస్తుల కేసులలో 16 నెలలు జైలుకి వెళ్లాల్సి వ‌చ్చింది.  ఇప్పుడు ఆయ‌న సిఎం అయినా… తను అధికార వ్య‌వ‌హారాల‌తో బిజీ బిజీ అంటూ మిన‌హాయింపులు కోరుతున్నా…  అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రతి శుక్రవారం హాజరు కావాల్సిన అగ‌త్యం  ఏర్పడింది.  నిజంగా ఈ పరిస్థితి ఆయ‌న‌కే కాదు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కూడా  ఇబ్బందికర ప‌రిణామ‌మే. 

అవినీతి అక్ర‌మాల‌ను స‌హించ‌బోనంటూ హెచ్చ‌రిక‌లు చేస్తూ వ‌స్తున్న ఆయ‌న  ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత  కూడా స్థిమితం సంపాదించ‌లేక పోతున్నార‌న్న ఆందోళ‌న వైసిపి వ‌ర్గాల‌లో క‌నిపిస్తోంది. ఎందుకంటే త‌మ పార్టీ అధికారం చేప‌ట్టిన నాటి నుంచి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాద‌స్ప‌దం కావ‌టం, కోర్టు మెట్లెక్క‌డం  కొన్ని కేసుల సందర్భంగా కోర్టులు నిర్ణయాల‌పై తీవ్ర మైన వ్యాఖ్యానాలు చేయ‌టం , చీవాట్ల రూపంలో వాటిని జ‌నం చూసి అవాక్క‌వుతున్నార‌న్న‌ది నిజం. 
ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి ప్రభుత్వానికి చెందిన   ఏదో ఒక కేసు  ప్ర‌తి రోజూ  హైకోర్టులో విచారణ జరుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న సందర్భం లేదనే చెప్పాలి. దీంతో ఏ కేసులో ఏత‌ర‌హాలో న్యాయ‌మూర్తులు వ్యాఖ్యానిస్తార‌న్న ఆందోళ‌న ప్ర‌భుత్వ వ‌ర్గాల‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. 
 
వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజుల‌లో తొలుత విద్యుత్ కొనుగోళ్లు, ఆపై పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టరు మార్పు అంశాలపై కోర్టు మెట్లెక్క వలసి వచ్చింది. రాజధాని తరలింపు మీద పలు కేసులు  దాఖ‌లు కావ‌టం… ఇలా వ‌రుస కేసుల‌తో అధికార వ‌ర్గంలో ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి. . ఇది ఎవరిలోపమో లేక అనుసరిస్తున్న విధానాల ఫలితమో  తెలియ‌రావ‌టం లేద‌న్న‌ది వారి మాట‌. 

అంతెందుకు  ఈ నెల 6 వ తేదీ గురువారం ఒక్క రోజునే మూడు కేసులను హైకోర్టు విచారించింది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఓ కేసు ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మించ కూడదని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా వున్నా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వివాద‌స్ప‌ద‌మైంది.  సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఈ కేసు తిరిగి హైకోర్టు చెంత‌కు చేరింది.  విచారణ జరిపిన న్యాయ‌మూర్తులు  తీర్పు వాయిదా వేసారు. 

దీనికి తోడు త‌గిన కార్యాల‌యాలు లేకుండా  విశాఖప‌ట్నాన్ని పరిపాలన రాజధాని చేస్తునే ఇందుకు వేదిక‌గా ఎంచుకున్న మిలీనియం టవర్ లో ఐటి కంపెనీలను ఖాళీ చేస్తుండ‌టంపై దాఖలు అయిన కేసు, అలాగే  కోర్టు ఆదేశాలిచ్చినా కర్నూలుకు విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాల తరలింపు కు ఉత్త‌ర్వులు జారీ చేసారంటూ దాఖ‌లైన కేసు విచారణ జరిగింది. ఇందుకు సంబంధించి స్ప‌ష్ట‌మైన నివేదిక‌లు ఇవ్వాలంటూ వాయిదాలు ప‌డ్డాయి. 

ఇక ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు పంచాయతీ కార్యాలయాలకు, డివైడ‌ర్ల‌కు ఇలా దేనికి ప‌డితే దానికి  వైసిపి పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు త‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  ఇంత సీరియస్ కామెంట్ చేసినా ఎక్క‌డా మార్పు రావ‌టం లేద‌ని ప‌లువురు కోర్టు ధిక్కార‌ణ కేసు న‌మోదు చేసేందుకు సిద్ద‌మ‌వుతున్న త‌రుణంలో  ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్  త‌రువాతే ఈ విష‌యంపై దృష్టి సారిస్తామ‌ని ఎన్నికల కమిషన్ హైకోర్టు కు విన్నవించింది. దీంతో ఈ కేసులో తామే ఆదేశాలు జారీ చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ కోరుతూ కేసు  వాయిదా వేసింది

మ‌రోవైపు రాజ‌ధాని కార్యాల‌యాల త‌ర‌లింపుపై కోర్టు ధిక్కార‌ణ‌ కేసులు న‌మోదుకు కొంత మంది సిద్ద‌మ‌వుతున్నట్టు మీడియాలో వస్తున్న క‌థ‌నాల నేప‌థ్యం చూస్తుంటే హైకోర్టు కేవ‌లం   ప్రభుత్వానికి వ్యతిరేకంగా వున్న కేసుల విచారణకే పరిమితమై పోతుంద‌న్న ఆందోళ‌న మిగిలిన కేసుల క‌క్షిదారుల‌లో క‌నిపిస్తోంది. ఏళ్ల త‌ర‌బ‌డి న్యాయ‌స్థానం చుట్టూ తిరుగుతున్నామ‌ని, ప్ర‌భుత్వ కేసుల కార‌ణంగా త‌మ కేసులు వాయిదా ప‌డుతున్న సంద‌ర్భాలు ఉన్నాయ‌ని వారి ఆందోళ‌న‌. 

  ఏ రాష్ట్రంలో కూడా  అధికారం చేపట్టి, ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన అనతికాలంలోనే ఇన్ని కేసులు ఎదుర్కొన్న సందర్భం లేదేమో.అన్న‌ది న్యాయ‌నిపుణులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇది ల‌క్ష‌ల్లో జీతాలందుకుంటున్న స‌ల‌హాదారుల వ‌ల్ల జ‌రుగుతోందా?  లేక ముందుగా న్యాయ‌కోణంలో విశ్లేషించుకోకుండా నిర్ణ‌యాలు ప్ర‌క‌టించి, రంగంలోకి దిగ‌టం వ‌ల్ల జ‌రుగుతోందా? అన్న‌ది పాల‌కులు గ‌మ‌నంలోనికి తీసుకుంటారో?  లేదో?  చూడాలి. 

Leave a Reply

Your email address will not be published.