స్థానిక తాయిలాల‌కు ర‌డీ అవుతున్న జ‌గ‌న్ స‌ర్కార్‌

ఆంధ్రప్రదేశ్‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ స్థానిక సంస్థల ఎన్నికలల‌లో వైసిపి జెండా ఎగ‌రేసి మ‌రోమారు త‌న స‌త్తా చాటాల‌ని సిఎం జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఈ ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న వేళ.. పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.  ఇప్పటికే వైజాగ్‌ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మార్చేందుకు స‌న్నాహాలు పూర్తి చేస్తున్న క్ర‌మంలోనే   విశాఖపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మంగ‌ళ‌వారం  విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రస్తుత పురోగతిని సమీక్షించారు. 

ముఖ్యంగా విశాఖ రాజ‌ధాని అవుతున్నందున  నగరానికి మెట్రో రైలు ప్రాజెక్టుపై క్షుణ్ణంగా సమీక్షించిన సీఎం. ఆర్కే బీచ్ నుంచి రాజ‌ధాని మీదుగా భీమిలీ బీచ్ వరకు ట్రామ్ ల  తరహాలో ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌పై చ‌ర్చించారు. ఈ దిశ‌గా ఖ‌ర్చెంత కానుందో అంచ‌నాలు వేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలిచ్చారు. తాగునీటి కొర‌త విశాఖకు రాకుండా చూడాల‌ని,  ఇందుకోసం పోలవరం నుంచి నగరానికి భూగర్భ పైపు లైన్ల ను ఏర్పాటు చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఉగాది నాటికి విశాఖలో 1.5 లక్షల ఇళ్ల పట్టాలు అందించ‌డం ద్వారా ప్ర‌జ‌ల మ‌న్న‌ల‌ను పొందేలా చూడాల‌ని అధికారుల‌కు తేల్చి చెప్పారు జ‌గ‌న్‌.  

అలాగే త‌న సొంత నియోజకవర్గం పులివెందుల, త‌న‌ నివాసం ఉన్న  తాడేపల్లి, చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేశ్‌ను ఓడించిన  మంగళగిరి  మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించాల‌ని నిర్ణ‌యించారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ముందే ఈ మున్సిపాలిటీల‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంఖుస్థాప‌న చేసేందుకు కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌ని ఆదేశాలిచ్చారు. మ‌రోవైప  కడప జిల్లాలోని కమలాపురంతోపాటు..  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లాలోని కుప్పంలను మున్సిపాలిటీలుగా మార్చి అక్క‌డ కూడా వైసిపి జెండా ఎగ‌రేయాల‌ని స‌ర్కారు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.  

రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో  రూ.23,307 వేల కోట్లు అంచనాతో 19,769 కి.మీ. భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు స‌మాయుత్తం కావాల‌ని,   దశల వారీగా మున్సిపాలిటీల ప్రాధాన్యత ఆధారంగా  ప్రకారం భూగర్భ డ్రైనేజీ, మురుగు నీటి శుద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవాల‌ని ఆదేశించ‌డంతో స్థానిక సంస్ధ‌ల‌లో గెలుపును సిఎం ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారో అర్ధం చేసుకోవ‌చ్చు. 

Leave a Reply

Your email address will not be published.