కరోనా మహమ్మారి విజృంభిస్తోంది….

వైరస్ ప్రాణసంకటంగా మారింది. దీంతో అంతర్జాతీయ సమాజం తీవ్ర కలవరపాటుకు గురవుతోంది. కరోనా వైరస్ విశ్వరూపం దాల్చడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ విస్తరిస్తున్న తీరు.. రోజురోజుకీ మరణాలు సంఖ్య పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’గా ప్రకటించింది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని సందేశాన్ని పంపింది.
ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడానికి చైనా తీసుకుంటున్న చర్యల్ని డబ్ల్యూహెచ్‌వో కొనియాడింది. ఇతర దేశాలు సైతం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ దేశాలు ప్రయాణాలపై విధిస్తున్న ఆంక్షల్ని డబ్ల్యూహెచ్‌వో తప్పుబట్టింది. దీని వల్ల బాధితులకు సరైన సహాయ సహకారం అందించేందుకు అడ్డంకులు ఏర్పడతాయని అభిప్రాయపడింది. తాత్కాలికంగా ఇలాంటి చర్యలు ఉపశమనం కలిగించినట్లు కనిపించినా.. దీర్ఘకాలంలో దుష్పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
200 దాటిన మృతుల సంఖ్య…
మరోవైపు కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 213కు చేరింది. మరో 9816 మందికి ఈ వైరస్ సంక్రమించినట్లు గుర్తించారు. ఒక్క చైనాలోనే 9692 మందిని బాధితులుగా గుర్తించగా.. హాంగ్‌కాంగ్‌లో 12, మకావు 7, తైవాన్ 9, ఇతర ఆసియా దేశాల్లో 62, ఐరోపాలో 13, ఉత్తర అమెరికాలో 8, ఆస్ట్రేలియాలో 9, ఇతర ప్రాంతాల్లో 4 కేసులు నమోదైనట్లు ధ్రువీకరించారు.
ఇక వైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న హుబెయ్ ప్రావిన్సులో 204 మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 20 దేశాలకు కరోనా వైరస్ పాకినట్లు ధ్రువీకరించారు.