ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు సైతం రాజధాని సెగ

రోజు రోజుకీ అమరావతి ఉద్యమం ఉదృతమవుతోంది. గత 60 రోజులుగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం రాజధాని తరలింపు ప్రక్రియని కొనసాగిస్తునే ఉంది.
తాజాగా ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు సైతం రాజధాని సెగ తగిలింది. గురువారం ఉదయం ఆమె నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసిన మహిళలు అక్కడకు చేరుకుని సమ్మిట్ బయట ఆందోళనకు దిగారు. తమను పెయిడ్ ఆర్టిస్టులంటూ మీడియాలో మాట్లాడిని రోజా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, అమరావతికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతొ సమ్మిట్ పూర్తి కాకముందే, రైతులు ఆగ్రహంతో ఉన్నారంటూ అప్రమత్తమైన పోలీసులు రోజాకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లి కాన్యాయ్ ఎక్కించారు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు రోజా కాన్వాయ్‌ను వెంబడించారు. మహిళలను నిలువరించేందుకు పోలీసులు కూడా వారి వెంట పరుగులు తీయాల్సి వచ్చింది. కాగా తనని జనం అడ్డుకోవటం పై రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పాటు స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు కేసులలో ఇరుక్కున్న రాజధాని రైతులు యూనివర్సిటీ వద్ద జరిగిన ఉద్రిక్తత కొత్త కాదని, రోజా కేసులు పెట్టినా భయపడబోమని తేల్చి చెప్పారు.