సీనియర్ జర్నలిస్టు పై మెగాస్టార్ దిగ్ర్భాంతి….

సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పసుపులేటి మరణ వార్తపై ఆయన మీడియాలో మాట్లాడుతూ ఆయన నాకు చాలా ఆత్మీయులు, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను ప్రోత్సహించిన వారిలో ఆయనొకరు. మా కుటుంబమంటే ఆతనికి ఎడతెగని అభిమానం. అందుకే లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా చిరంజీవి నాగ పవన్ అని పేరుపెట్టుకున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. సినియర్ జర్నలిస్టుగానే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని, నీతికీ నిజాయితీకీ నిబద్దతకూ మరోరూపంలా రామారావుగారు నిలుస్తారని చిరంజీవి అన్నారు.
ఆమధ్య మేం కలసినప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని, సరిగా నడవలేకపోతున్నారని తెలిసింది. ఆతన్ని సన్ షైన్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపిస్తే,. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. కానీ తన అక్కయ్య కి బాగోలేదని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని రామారావు అన్నారు కానీ అనుకోకుండా ఇలా జరిగింది. ఆయన కుటుంబం బాగోగులను ఆత్మీయుడిగా చూసుకుంటా,అన్నిరకాలుగా అండగా ఉంటాను అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ చిరంజీవి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు….