అపరిపక్వ నిర్ణయాలతోనే ఆర్ధిక కష్ఠాలు

అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకు  అంద‌రినీ త‌మ‌వైపుకు
తిప్పుకునేలా వారి వారి ఖాతాల‌లో పెద్ద మొత్తాల‌ను డిపాజిట్ చేసే ప‌నిలో ఏపిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉంది. ఇలా విచ్చలవిడిఖర్చుపెట్టటంతో అస‌లే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర‌ ఆర్ధిక వ్యవస్థ మ‌రింత అస్తవ్యస్తంగా తయారయ్యిందనే చెప్పాలి. ఓ వైపు మద్యపాన నియంత్రణ  మాటున ప్రభుత్వానికి ప‌డుతున్న ఆదాయ గండితో దాదాపు 20వేల కోట్ల వ‌ర‌కు న‌ష్టం వాటిల్ల‌నుంది,  మ‌రోవైపు ప్రభుత్వ ఖర్చులు ఏమాత్రం త‌గ్గించుకోకుండా  విపరీతంగా పెంచుకుంటూ పోతోంది రాష్ట్ర స‌ర్కారు.  ఇది కాస్త‌ ఆర్ధిక వ్యస్థపై పెనుప్రభావం చూపుతుంటే… అప్పులు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ప్ర‌భుత్వ భూముల‌ను అమ్మేసి తాయిలాలందించేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కారు చూస్తుండ‌టంతో భ‌విష్య‌త్‌తో ప్ర‌భుత్వం చేప‌ట్టే ఏ నిర్మాణానికైనా మ‌ళ్లీ భూముల‌కోసం సామాన్యుల మీదే దండ‌యాత్ర చేసే ఆస్కారం క‌నిపిస్తోంది.  

గ‌త ప్ర‌భుత్వ  హయాంలో ప‌లు ప్రాజెక్టుల్లో , అమ‌రావ‌తి నిర్మాణంలో,  ప‌థ‌కాల‌లో విపరీతమైన అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వ‌చ్చిన వైసిపి, త‌ను అధికారంలోకి రాగానే వాటన్నిటినీ పునఃసమీక్ష ఆరంభించింది. అన్నింటా రివ‌ర్స్ విధానం ఆరంభించ‌డంతో   ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం  మిగిలిందని ప‌దే ప‌దే ప్ర‌క‌టించింది. ఈ ఉత్సాహం  పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టులపై  కూడా చూపించి పెద్ద తేన తుట్టెను కదిలించింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్వాకంపై గ‌త కొంత కాలంగా కేంద్రం భ‌గ్గుమంటునే ఉంది. త‌న రివ‌ర్స్‌తో వంద‌ల కోట్లు ప్ర‌భుత్వానికి మిగిల్చాన‌ని సాక్షాత్తు జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీకి చెప్పినా..  రాబోయే ఐదేళ్ల‌లో పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టులపై గణనీయంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి కేంద్ర ప్రభుత్వం వేసుకున్న‌ ప్రణాళికలపై తీవ్ర ప్ర‌భావం చూపే ఆస్కారం ఉంద‌ని భావించిన కేంద్రం విదేశీ పెట్టుబ‌డులు  వెనక్కుపోతాయేమోననే ఆందోళ‌న ప‌దే ప‌దే వ్య‌క్తం చేస్తునే ఉంది. 
నిజానికి భారత్ పారిస్ పర్యావరణ ఒప్పందం ఆమోదించి, పునరుత్పాదక విద్యుత్తులో భాగమైన సౌర విద్యుత్తు ప్రపంచ సంఘం భార‌త్  కేంద్రంగానే పనిచేయాల‌ని నిర్ణ‌యించింది. దీంతో  పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు బహుళజాతి సంస్థలు ఉత్సాహం చూపాయి. ఈ అవ‌కాశాన్ని వినియోగించుకున్న గ‌త స‌ర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆక‌ర్షించ‌గ‌లిగింది.  ఇలా పెట్టుబడి పెట్టిన సంస్థలు ప్రపంచంలోనే పలుకుబడి కలిగినవి కావ‌టం గ‌మ‌నార్హం. ఇలా పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌లో రాష్ట్ర రెండో స్థానాన్ని అందుకోవ‌టం ఆలోచించ‌ద‌గ్గ‌దే. 
కానీ జ‌గ‌న్ స‌ర్కారు   ఈ ప్రాజెక్టులన్నీంటిపైనా పునఃసమీక్ష చేయ‌టం ఆరంభించ‌డంతో దీని ప్రభావం ఖ‌చ్చితంగా పెట్టుబడులపై  ప‌డుతుంద‌ని కేంద్రం ఆందోళ చెందుతోంది. దీనికి తోడు ఈ ప్రభావం ఈ ఏడాదే కనబడి ఏపి స‌ర్కారు సార‌ధ్యంలో ఉన్న విద్యుత్తు పంపిణీ సంస్థలు దాదాపు 20వేల కోట్ల రూపాయలు ఈ విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు బాకీ పడి స‌ర్కారును ఆందోళ‌న‌లో ప‌డేసింది.
కానీ మంత్రులు, ముఖ్య‌మంత్రి వాద‌న‌లు మ‌రోలా ఉంటున్నాయి. అన్నీ సెల్‌ఫోన్లు నిన్న‌టి ధ‌ర‌ల‌తో నేటి ధ‌ర‌లు పోలుస్తూ… అంతా త‌గ్గుతుంటే ఎక్కువ ధ‌ర ఎందుకివ్వాల‌న్న‌ట్టు చెపుతున్నారు. వాస్త‌వానికి నాటి ధ‌ర‌ల మేర‌కు  కాంట్రాక్టు ఒప్పందం చేసుకుంటార‌న్న సంగ‌తి వంద‌లాది కాంట్రాక్ట‌ర్లున్న వైసిపికి, సాక్షాత్తు త‌నే సండూర్ ప‌వ‌ర్ ప్లాంట్‌ని న‌డుపుతున్న ముఖ్య‌మంత్రికి తెలియంది కాదు.  కాబట్టి ప్రాజెక్టు టెండర్ దక్కించుకున్నప్పటికంటే ఇప్పుడు తక్కువ ఖరీదుకే లభ్యమవుతాయి క‌నుక రివ‌ర్స్ మాటున మిగిలించామ‌ని చెపుతున్నారు. 
అయితే  సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టుల్లో సాంకేతికత భార‌త్‌లో త‌క్కువ‌గా ఉంది. ఈ కార‌ణంగానే  విదేశీ సంస్థలనుంచి పెట్టుబడులు ఆహ్వానించింది కేంద్రం. వాటిని సమీక్షింటం జరిగితే భవిష్యత్తులో రానున్న‌విద్యుత్తు ప్రాజెక్టులతో పాటు మిగతా రంగాల్లోకి వ‌స్తున్న విదేశీ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపే ఆస్కారం ఉంది.  అతికష్టం మీద వస్తున్న పెట్టుబడులు జ‌గ‌న్ స‌ర్కారు చేస్తున్న రివ‌ర్స్ కార‌ణంగా ఆగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని, దేశ ఆర్ధిక రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట మంటగలుస్తుంద‌న్న‌ది కేంద్రం ఆందోళనకు గురవుతుంది.
ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర ప్రభుత్వం సాధక బాధకాలను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ  పరిష్కారమార్గాలు  సూచిస్తూ కేంద్ర రంగ సంస్థలైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుత్తు సంస్థ త‌దిత‌రాల నుంచి రుణం అందించేందుకు కూడా సిద్ద‌మైంది. ఏపి నుంచి విద్యుత్తును కొనటంతో పాటు అంతరాష్ట్ర సరఫరాపై విధించే సుంకాన్ని మినహాయించటానికి  ఒప్పుకుంది.  అయితే కొత్త‌గా అధికారంలో కి వ‌చ్చిన వైసిపి ప్ర‌భుత్వం ఒప్పందానికి రాకుండా పేచీ పెడుతుండ‌ట‌మే కేంద్రానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. దీంతో ఇప్పటికే ఆమోదించిన రుణ సహాయాన్ని ఆపివేయటం, బొగ్గును థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు సరఫరా చేయకుండా నిలివేయటం లాంటి ప్రతీకారచర్యలకు పూనుకోవటం పై కేంద్రం దృష్టి సారించింది. 
దీనికి తోడు మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు రాష్ట్ర స‌ర్కారుకు త‌ల‌నొప్పిగా మారే ప‌రిస్థితి ఉంది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌ను  ఆస‌రాగా తీసుకుని,  రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టటం పెద్ద కష్టమేమీ కాదు. అదే జరిగితే రాష్ట్రం పీకలలోతు కష్టాల్లో ఇరుక్కోవటం ఖాయంగా క‌నిపిస్తోంది. జగన్ అపరిపక్వ నిర్ణయాలతో  ఆర్ధిక కష్ఠాలను కోరి తెచ్చుకుంటున్నా డనిపిస్తుంది.  ప‌ప్పు బెల్లాల్లా ఉచిత ప‌థ‌కాలు రాష్ట్ర ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత దిగ‌జారుస్తాయ‌న్న ఆందోళ‌న స‌ర్వ‌త్రా నెల‌కొంది. ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి మ‌రి.

Leave a Reply

Your email address will not be published.