ఢిల్లీలో త్రిముఖపోరు ఖాయ‌మైన‌ట్టే మరి ఢిల్లీ పీఠం ఎవరిదో..?
ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలలో నామినేష‌న్ వేసేందుకు చివ‌రి తేదీ స‌మీపిస్తున్న కొల‌ది అక్క‌డి రాజ‌కీయ ప‌రిణామాలు క్ష‌ణం క్ష‌ణం మారిపోతున్నాయి. ఎలాగైనా సరే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తున్న ‘ఆప్’ ఈ సారి ప్ర‌శాంత్ కిషోర్ స‌హాయంలో వ్యూహాలు రూపొందిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ ఫిరాయింపుల‌పై ఆస‌క్తి చూప‌ని ఆప్ అధినేత కేజ్రీవాల్ త‌ప్ప‌ని స‌రిప‌రిస్థితిలో బిజెపి, కాంగ్రెస్‌ల నుంచి ఫిరాయిం పులను సైతం ప్రోత్సహిస్తూ ముందుకెళ్లాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చ‌క‌చ‌కా మారిపోతున్నాయి. కేజ్రీవాల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌మిశ్రా, రాంసింగ్‌ ఆప్‌లో చేరటం ఢిల్లీ ఎన్నికల్లో చీపురు హవా ఉంటుందని విశ్లేష‌కులు చెపుతున్న మాట‌. దీంతో కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ‘చీపురు’ పార్టీ వైపు చూస్తున్నారు. దీనికి తోడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌లొ లోలోన క‌నిపిస్తున్న అస‌మ్మ‌తి సెగ‌ల కార‌ణంగా ఇప్పటి వరకు సీఎం అభ్యర్థిని ప్రకటించలేకుండా పోయాయి. దీంతో ఆ రెండు పార్టీల‌లో అగ‌మ్య‌గోచ‌రంగా నేత‌ల ప‌రిస్థితి మారింద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. 

మరోసారి ఢిల్లీపై పట్టుసాధించి, త‌న స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంటే, పార్ల‌ మెంటు ఎన్నిక‌ల‌లో చూపిన హ‌వాని అసెంబ్లీ ఎన్నిక‌ల‌లోనూ చూపి పీఠం ద‌క్కిం చుకోవాల‌న్నబిజెపి వ్యూహాల‌కు ధీటుగా కేజ్రీవాల్ వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో  ఢిల్లీలో త్రిముఖపోరు ఖాయ‌మైన‌ట్టే.. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో 1.46 కోట్ల మంది ఓట‌ర్లు ఫిబ్రవరి 8వ తేదీన జ‌రిగే పోలింగ్ లో ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు గాను ఈసీ 13, 750 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. మరి ఢిల్లీ పీఠం ఎవరిదో..? ఎవరు దానిపై కూర్చుంటారో..? అనేది ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాల నాడు తేలిపోనుంది.


Leave a Reply

Your email address will not be published.