ప్రగతి శూన్యం – స్కిల్ గేమ్స్ ఘనం

 పైన ప‌టారం – లోన లొటారం?
క‌లెక్ట‌ర్‌, ఎస్పీ బేన‌ర్ల‌తో సంద‌ర్శ‌కుల నిలువు దోపిడీ?
దేశ‌, రాష్ట్ర, జిల్లా స్థాయిల‌లో పారిశ్రామిక‌, వ్య‌వ‌సాయ రంగాల‌లో సాధించిన ప్ర‌గ‌తిని ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేసేందుకు ప్ర‌తి ఏటా ఆయా స్థాయిల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది. గ‌త 15 సంవ‌త్స‌రాలుగా తూర్పుగోదావ‌రి జిల్లాలో  ఏర్పాటు చేస్తున్న‌ పారిశ్రామిక‌, ఫ‌ల, పుష్ప ప్ర‌ద‌ర్శ‌న ల‌లో విజ్ఞాన‌, వినోదాల‌తో పాటు జిల్లా ప్ర‌గ‌తి మాయం అవుతూ ఆ స్థానంలో స్కిల్ గేమ్స్ (జూదం) ప్ర‌వేశించి సంద‌ర్శ‌కుల జేబును కొల్ల‌గొడుతున్నారు నిర్వాహ‌కులు.
జిల్లాలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక, వ్య‌వ‌సాయ రంగాల‌లో సాధించిన ప్ర‌గ‌తిని చాటి చెప్పే విధంగా ఆయా రంగాల‌ను ఆవిష్క‌రిస్తూ ఏర్పాటు చేసే స్టాల్స్, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులతో పాటు రాష్ట్ర, జిల్లా ప్ర‌గ‌తిల‌ను చాటుతూ ఒక‌టి రెండు శాఖ‌లు  ఏర్పాటు చేసి గ‌త 15 సంవ‌త్స‌రాలుగా మొక్కుబ‌డిగా అతి పేల‌వంగా పారిశ్రామిక‌, ఫ‌ల, పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ఏర్పాటు చేస్తూ జిల్లా యంత్రాంగం చేతులు దులిపేసుకుంటుంది. అదే విధంగా గ‌త 15 సంవ‌త్స‌రాలకు పూర్వం కాకినాడ కుళాయి చెరువులో ఏర్పాటు చేసే పారిశ్రామిక‌, ఫ‌ల‌, పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించ‌డానికి జిల్లా న‌లుమూల‌ల నుండి విద్యార్ధులు  ప్ర‌త్యేక బ‌స్సుల‌లో త‌ర‌లివచ్చి చూసేవారు. ఇప్పుడు ఈ ప్ర‌ద‌ర్శ‌నలో ముఖ ద్వారాన్ని మాత్రం పెద్ద ఎత్తున(జంతువు బొమ్మతో) ఏర్పాటు చేయ‌డం మిన‌హా ఎటువంటి ఆకర్ష‌ణీయ‌మైన అంశాలు లేక‌పోవ‌డంతో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించ‌డానికి విద్యార్ధులు, ప్ర‌జ‌లు పెద్ద‌గా సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు.రూ.30 /- ల ఎంట్రీ ఫీజు తో పాటు మ‌రో రూ.10/- లు పార్కింగ్ ఫీజు చెల్లించి ఫ‌ల‌పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించ‌డానికి వెళ్ళిన సంద‌ర్శ‌కులకు తీవ్ర నిరాశేఎదుర‌వుతోంది.అక్క‌డ కేవ‌లం వారాంత‌పు సంత‌ల‌లో ఏర్పాటు చేసే దుకాణాల‌తో పాటుగా  జేబు గుల్ల చేసే స్కిల్ గేమ్‌ల స్టాల్స్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయ‌ని ప్ర‌భుత్వ యంత్రాంగంపై సంద‌ర్శ‌కులు ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఎగ్జిబిష‌న్ ప్ర‌ధాన ద్వారం ద‌గ్గ‌ర జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీ బేనర్ల‌తో పాటుగా ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధుల బేన‌ర్ల‌ను ఏర్పాటు చేసి వారి అండ దండ‌ల‌తోనే   ప్ర‌భుత్వ నిషేధిత స్కిల్ గేమ్‌లను బ‌హిరంగంగా ఇక్క‌డ నిర్వ‌హిస్తూ  నిలువుదోపిడీ చేస్తున్న నిర్వాహ‌కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంద‌ర్శ‌కులు కోరుతున్నారు.
హ‌స్త‌లాగ‌వంతో ఆడే గ్లాస్, బాల్ షూటింగ్‌, రింగాట‌, గుండాట‌, గోవాగేమ్‌( స్నోబాల్), బారెల్ తో పాటుగా దానిపై ఉండే ఫ్రంట్‌ సైట్ పిన్‌ను మార్పు చేయ‌డం ద్వారా ఎన్ని రౌండ్‌లు కాల్చిన టార్గెట్‌ను ఛేదించ‌కుండా ఉండే విధంగా మార్పు చేసిన  రైఫిల్ షూటింగ్  ను పెద్ద ఎత్తున ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏర్పాటు చేయ‌డం ద్వారా సంద‌ర్శ‌కుల‌ను దోపిడీ చేస్తున్నార‌ని సంద‌ర్శ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
ఇక చిన్న‌పిల్ల‌లు ఇష్ట‌ప‌డే జెయింట్‌ వీల్‌, బ్రేక్ డేన్స్‌, స్పైడ‌ర్ ట్రైన్‌ల ధ‌ర‌లు ఆకాశాన్నంటే విధంగా 60 నుండి 50 రూపాయ‌లుగా నిర్ణ‌యించ‌డం దారుణ‌మ‌ని సంద‌ర్శ‌కులు అంటున్నారు. ఎంట్రీ, పార్కింగ్ ఫీజు రూపేణా రూ.40/- లు వ‌సూలు చేసిన నిర్వాహ‌కులు రూ.10/- లు విలువ చేసే రైడ్స్‌కు ఎగ్జిబిష‌న్ నిర్వాహ‌కులు 5 రెట్లు ధ‌ర‌లు పెంచి వ‌సూలు చేస్తున్నా చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిన మునిసిప‌ల్‌ అధికార్లు చోద్యం చూస్తున్నారంటూ సంద‌ర్శ‌కులు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.
జిల్లా ప్ర‌ధాన కేంద్రంలో  ప్ర‌భుత్వ ప‌రంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్‌ను చూడ‌డానికి సంద‌ర్శ‌కుల‌కు ఉచిత ప్ర‌వేశం క‌ల్పించాల‌ని సంద‌ర్శ‌కులు డిమాండ్ చేస్తున్నారు. అధిక మొత్తంలో  ఎంట్రీ, పార్కింగ్ ఫీజుల వ‌సూలుతో పాటుగా, అసాంఘిక కార్య‌క‌లాపాల‌ను బ‌హిరంగంగా నిర్వ‌హిస్తున్నా సంబంధిత అధికార్ల‌తో పాటు, చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాలపై ఉక్కుపాదం మోపాల్సిన‌ పోలీసులు చూసి చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డంపై సంద‌ర్శ‌కులు తీవ్ర నిరసన వ్య‌క్తం చేస్తున్నారు.
కాకినాడ జె.యన్‌.టి.యు. ఎదురుగా ఏర్పాటు చేసిన‌ చేనేత‌, హ‌స్త‌క‌ళ‌ల ఎగ్జిబిష‌న్  చాలా ఆక‌ర్ష‌ణీయంగాను, చౌక‌ధ‌ర‌ల‌లో వ‌స్తువులు దొరుకుతున్నాయని, ప్రైవేట్ స్థ‌లంలో, ప్రైవేట్ వ్య‌క్తులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్‌కు  ఎటువంటి ఎంట్రీ, పార్కింగ్‌ ఫీజు లు వ‌సూలు చేయ‌డంలేద‌ని తెలిపారు శ్రీకాంత్‌.
కాకినాడ న‌గరానికి  25 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన యానాంలో ప్ర‌తి ఏటా  ఏర్పాటు చేసే ఫ‌ల‌, పుష్ప ప్ర‌ద‌ర్శ‌న క‌నుల‌విందుగా ఉంటుంది. దానిని తిల‌కించ‌డానికి జిల్లా నలుమూల‌ల నుండి వేలాదిగా ప్ర‌జలు త‌ర‌లి వెళుతుంటారు.  భౌగోళికంగా కాకినాడ న‌గ‌రంలోని ఒక డివిజ‌న్ అంత ఉండ‌ని యానాంలో క‌నులు మిరుమిట్లుగొలిపే విధంగా ఫ‌ల‌, పుష్ప ప్ర‌ద‌ర్శ‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు, అదే స్థాయిలో సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.ఇప్ప‌టికైనా జిల్లా యంత్రాంగం క‌ళ్లు తెర‌చి తూతూ మంత్రంగా ఏర్పాటు చేసిన‌ 43వ‌. పారిశ్రామిక‌, ఫ‌ల‌, పుష్ప ప్ర‌ద‌ర్శ‌న ఎక్కువ మంది సంద‌ర్శ‌కులు తీలకించేందుకు వీలుగా ప్ర‌వేశ‌, పార్కింగ్ ఫీజుల‌తో పాటుగా అసాంఘిక కార్య‌క‌లాపాలైన స్కిల్ గేమ్స్ స్టాల్స్‌ను తొల‌గించి, రాష్ట్ర, జిల్లా ప్ర‌గ‌తిని తెలియ‌చేస్తూ విజ్ఞాన‌, వినోదాల‌తో కూడిన స్టాల్స్ తో పాటు బ‌హుళార్ధ‌క‌సాధ‌క ప్రోజెక్టు పోల‌వ‌రం నిర్మాణ ప్ర‌గ‌తిని తెలియ‌చేసే ఫొటో ఎగ్జిబిష‌న్‌ను  ఏర్పాటు చేయాల‌ని జిల్లా వాసులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.