వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైట ఒక మాట …

ఒక మాట మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ఆ పార్టీ శ్రీశైలం నియోజకనగ్గ శాసనసభ్యుడు శిల్పా చక్రపాణిరెడ్డి. కర్నూలు జిల్లా ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో.. ఆయన మాట్లాడుతూ ఈ మధ్య పార్లమెంటులో దేశంలోని ముస్లింలపై వివక్ష చూపేలా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు తమ పార్టీ మద్దతివ్వడాన్ని తప్పుపట్టారు. ముస్లిం మైనార్టీ వర్గాలు తమ పౌరసత్వాన్ని, వారసత్వాన్ని నిరూపించేందుకు ఉద్దేశించిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత జగన్ బహిరంగంగా చెపుతున్నా, పార్లమెంటు దగ్గరకి వచ్చేసరికి ఆ బిల్లులకు తమ ఎంపీలు మద్దతివ్వడం వెనుక ఆంతర్యమేంటో అర్ధం కావటం లేదని అన్నారు. ఈ వ్యవహారంలో తమ పార్టీ స్టాండ్‌ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
దేశంలోని పలు రాష్ట్రాలు ఈ చట్టం అమలు చేయబోమని తీర్మానిస్తున్నాయని, ఈ తరహా తీర్మానం మన అసెంబ్లీ కూడా చేయాలని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని, ఆ చట్టాలతో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పారన్నారు. ముస్లిం, మైనార్టీలకు ఈ చట్టం అమలు ముసుగులో ఇబ్బందులు పెట్టాలని సహించేది లేదని, ఈ చట్టం రాష్ట్రంలో అమలు కాకుండా ఉండేందుకు అవసరమైతే రాజీనామా చేసేందుకూ వెనుకాడనని శిల్పా స్పష్టం చేయటంతో వైసిపి వర్గాలలో ఇప్పుడీ అంశం చర్చగా మారింది.