ఇష్టం లేని విధంగా త‌ల్లి త‌న‌కు కటింగ్‌ చేయించిందంటూ ఓ విద్యార్థి ఆత్మహత్య…

త‌న‌కు ఇష్టం లేని విధంగా త‌ల్లి త‌న‌కు కటింగ్‌ చేయించిందంటూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న‌ ఘటన చెన్నైలోని వలసరవక్కం ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. కుంద్రత్తూర్‌లోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ 12వ తరగతి చదువుతున్నశ్రీనివాసన్‌ (17) పండుగ సెలవులక‌ని ఇంటికి వచ్చాడు. ఆత‌న‌ హెయిర్‌ స్టైల్‌ చూసిన తల్లి మోహన అస‌లు నువ్వు స్టూడెంట్‌లా ఉన్నావా? ఏంటీ జుట్టు? ఏంటా క‌టింగ్‌, ఏమిటీ వేషాలంటూ  కుమారుడిని కోప్పడింది. తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ,  కటింగ్‌ చేసుకొని ఒద్దిక‌గా బుద్ది మంతుడిగా క‌నిపించాల‌ని సూచించింది. 

త‌ల్లి మాట‌తో తిరిగి సెలూన్‌కి వెళ్లిన శ్రీ‌నివాస‌న్ అటు ఇటుగా తిరిగి అదే ఫ్యాష‌న్‌తో హెయిర్ స్టైల్ చేయించుకుని ఇంటి కొచ్చారు. దీంతో ఒళ్లు మండిన ఆ త‌ల్లి,  త‌న కొడుకు ఎక్కడ కట్‌ చేయించుకున్నాడో ఆ  హెయిర్‌ సెలూన్‌కు అత‌నిని తీసుకెళ్లి ద‌గ్గ‌రుండి మ‌రీ కటింగ్‌ చేయించి, ఇంటికి తీసుకు వెళ్లి స్నానం చేయిచి,  మోహన త‌న కార్యాల‌యానికి పనికి వెళ్లిపోయింది. 

అయితే సాయంత్రం ఇంటికొచ్చి చూసే సరికి కుమారుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఆత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టానికి ప్ర‌ధాన కార‌ణం త‌ల్లి త‌న‌కు న‌చ్చిన హెయిర్ స్టైల్ కాకుండా పూర్తిగా జుట్టు తొల‌గించి మిల‌ట‌రీ క‌టింగ్ చేయించ‌డ‌మేన‌ని తెలియ‌వ‌చ్చింది. ఈ ఆత్మ‌హ‌త్య స‌మాచారం అందుకున్న పోలీసులు, శ‌వాన్ని పోస్టుమార్టంకు త‌ర‌లించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, మ‌రోవైపు విద్యాసంస్ధ‌లన్నీ త‌మ  విద్యార్థులు ఎవ్వ‌రూ ఫ్యాషన్‌ కటింగ్‌లు చేయించుకుని పాఠ‌శాల‌ల‌కు రావ‌ద్ద‌ని,  చక్కగా హుందాగా ఉండేలా కటింగ్‌లు చేసుకుంటేనే  స్కూళ్లలోనికి అనుమ‌తిస్తామ‌ని విద్యార్థులను ఆదేశించాయి. అలాగే, పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు ప‌లు హెయిర్‌ సెలూన్లకు తిరిగి త‌మ విద్యార్ధులు కోరినా  ఫ్యాషన్‌ కటింగ్‌లు చేయ‌వ‌ద్ద‌ని  అభ్యర్థించడం విశేషం. 

Leave a Reply

Your email address will not be published.