శంకరాభరణం.. నాలుగో దశాబ్ధం!

సంగీతం నేపథ్యంలో కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ౠశంకరాభరణంౠ. సంగీతం అంటే పిచ్చి ప్రకోపించడం కాదు.. దానికి ఒక గొప్ప పద్ధతి ఉంటుందని ఎంతో గొప్పగా చెప్పిన చిత్రమిది. జె.వి.సోమయాజులు ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ సినిమాలో మంజు భార్గవి కథానాయికగా నటించారు. ప్రతిష్ఠాత్మక పూర్ణోదయ బ్యానర్ పై ఏడిద నాగేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శంకరాభరణం కథే ఓ ఆణిముత్యం. శంకరశాస్త్రిగా పేరుగాంచిన శంకరశాస్త్రి (జె వి సోమయాజులు) ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకానొక వేశ్య కూతురు, గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన ఒక విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో ఆత్మరక్షణకై చంపినట్లుగా నిరూపించి తులసిని విడిపిస్తాడు. వేశ్యకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్దికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక కొడుకుకి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.

ఈ మొత్తం కథను ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించడంలో కె.విశ్వనాథ్ చూపిన పనితనానికి దక్కని గుర్తింపు.. లేనేలేదు. సోమయాజులు, మంజు భార్గవిల నటనకు గొప్ప గుర్తింపు దక్కింది. కమర్షియల్ సినిమాల వెల్లువలో వచ్చిన ఈ సినిమా ఎవ్వర్ గ్రీన్ క్లాసిక్ చిత్రంగా సంచలన విజయం అందుకుంది. నాలుగు జాతీయ అవార్డులు, ఐదు నందులు గెలుచుకున్న మేటి చిత్రంగా నిలిచింది. ఈ సినిమా స్ఫూర్తితోనే ఎందరో కర్ణాటక శాస్త్రియ సంగీతం నేర్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ ఆణిముత్యం విడుదలై నేటికి 39 సంవత్సరాలు (02/02/1980)  పూర్తయింది. 02 ఫిబ్రవరి 2020 నాటికి నాలుగు దశాబ్ధాలు పూర్తవుతుంది.

Leave a Reply

Your email address will not be published.