దేశ రాజధాని ఢిల్లీలో ‘ఐ లవ్ అమరావతి’ బోర్డును తొలగించారు….

ఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత ఏపీ భవన్లో అమరావతి బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవాళ(ఆదివారం) ఆ బోర్డును ఏపీ భవన్ సిబ్బంది తొలగించారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఆదేశాలతో బోర్డును తొలగించినట్లు సమాచారం.
అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత ‘ఐ లవ్ అమరావతి’ బోర్డును ఏర్పాటు చేశారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో బోర్డును తొలగించడం వివాదస్పదమవుతోంది. అయితే బోర్టు తొలగింపుపై ఏపీ భవన్ అధికారులు పొంతనలేని సమాధానం చెబుతున్నారు. కోతుల బెడదతో తొలగించామని అధికారులు చెబుతున్నారు. కోతుల బెడద వల్ల తొలగించడం ఏమిటని ఢిల్లీలోని ఏపీ వాసులు ప్రశ్నిస్తున్నారు.
ఇంతలోనే ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘ఐ లవ్ అమరావతి’ బోర్డు సెల్ఫీ స్పాట్‌కు వేదికగా ఉండేదని నెటిజన్లు చెబుతున్నారు. దీంతో అధికారుల చర్యను వారు తప్పుబడుతున్నారు. తిరిగి అక్కడే బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.