ఈశాన్యంలో ఆగని నిరసనల సెగలు!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (క్యాబ్)పై రగులుకున్న ఈశా న్య భారతంలో రగిలిపోతోంది. గత రెండ్రోజులుగా జరుగుతున్న వరుస హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో తీవ్రస్థాయి నిరసనలు చెలరేగాయి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో నిరసనకారుల తీవ్రస్థాయి ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఆందోళనల తీవ్రత నేపథ్యంలో షిల్లాంగ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. ఈ ప్రాంతంలోనే మేఘాలయా సిఎం కోనార్డ్ సంగ్మాకు నిరసనల సెగ తగిలింది. క్యాబ్ నిరసన జ్వాలలతో మేఘాలయాలో ఉద్రిక్తత నెలకొంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌లో ప్రజలు భారీ సంఖ్యలో గుమికూడారు. దీనితో వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జికి దిగారు. రాజ్‌భవన్‌కు సమీపంలోనే పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీనితో చాలా సేపటివరకూ అక్కడేం జరుగుతున్నదో తెలియని స్థితి నెలకొంది.
షిల్లాంగ్ వీధులలో రాత్రి వరకూ కూడా భారీ సంఖ్యలో జనం వచ్చి నినాదాలకు దిగారు. కర్ఫూ సడలింపు సమయంలో పెద్ద సంఖ్యలో జనం వీధుల్లోకి చేరుకుని నిరసనలు కొనసాగించడంతో పరిస్థితిని అదుపులో పెట్టేందుకు అధికారులు నానాతంటాలుపడాల్సి వచ్చింది. షిల్లాంగ్ తదితరప్రాంతాలలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. రెండు రోజుల పాటు వీటిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనితో ఈ ప్రాంతంలో ప్రజలకు సరైన సమాచారం లేనిపరిస్థితి ఏర్పడింది.షిల్లాంగ్ అంతటా మార్కెట్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయ.
షిల్లాంగ్‌కు చాలా దూరంలోని విలియంనగర్ టౌన్లో ప్రదర్శనకారులు ముఖ్యమంత్రి కోనార్డ్ సంగ్మాను చుట్టుముట్టి అక్కడి నుంచి వెనకకు నెట్టిపంపించారు. ఇక్కడ ఒక స్వాతంత్య్ర సమరయోధుడి వర్ధంతి సభకు హెలికాప్టర్లో వచ్చి కిందకు దిగిన ముఖ్యమంత్రి నిరసనకారుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడి రెండు కార్లకు నిప్పంటించారు. ప్రధాన మార్కెట్లను మూసివేయించారు. పోలీసు బజార్లో మార్కెట్లను మూసివేయించేందుకు నిరసనకారులు చేరుకున్నారు. పట్టణ ప్రధాన వీధులలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టినట్లు తెలిపే ఫోటోలతో సామాజిక మాధ్యమాలలో ఉద్యమ వార్తలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి కోనార్డ్కు వ్యతిరేకంగా సిఎం కాన్వాయ్ ఎదుటే అ త్యధిక సంఖ్యలో యువతీయువకులు బ్యానర్లు చేతపట్టుకుని గోబ్యాక్ నినాదాలకు దిగారు. . దీనితో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకుంది.
మరోవైపు తమ ఉనికి భంగకరంగా ఉండే చట్టాన్ని సహించేది లేదని పేర్కొంటూ ఆరవ నెంబరు జాతీయ రహదారిపై వేలాది మంది ముస్లింలు గుమికూడారు. దీనితో భారీ వాహనాలు గంటల తరబడి నిలిచిపొయ్యాయి. పశ్చిమబెంగాల్లో బంగ్లాదేశ్‌కు పొరుగున ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో బెల్దంగ రైల్వేస్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పంటించారు. పలు భవనాలను, ఫ్లాట్‌ఫాంను తగులబెట్టిన ఆందోళనకారులు అడ్డుకున్న రైల్వే పోలీసు బలగాలను చితకబాదారు.
ఇక హౌరా జిల్లాలో ఉలూబెరియా రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకారులు పట్టాలపై నిలబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గించారు. అక్కడి రైల్వే కాంప్లెక్స్‌ను ధ్వంసం చేశారు. కొన్ని రైళ్లను తగులబెట్టే యత్నం చేశారు. డ్రైవర్, ఇతరులను గాయపర్చారని అధికారులు తెలిపారు.బ్లాకేడ్ ప్రారంభించడంతో ఇరువైపుల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులను ఆయా స్టేషన్లలో ఉంచాల్సి వచ్చినట్లు ఆగ్నేయాసియా రైల్వే అధికారులు తెలిపారు. హౌరా చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ నిరసనకారులు రువ్విన రాళ్లతో గాయపడ్డారు. ఉలూబెరియా రైల్వేస్టేషన్ అంతా రణరంగంగా మారింది. హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఖాళీ బోగీని ధ్వంసం చేశారు. ఘటనలలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు తాము బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ సాయం అభ్యర్థించినట్లు ఆగ్నేయ రైల్వే విభాగం తెలిపింది. హౌరా ఖరగ్‌పూర్ సెక్షన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు దూర ప్రాంత, సబర్బన్ రైళ్లు నిలిచిపొయ్యాయి. హౌరా దిఘా కాంధారి ఎక్స్‌ప్రెస్ కూడా ఆగిపోయింది.