ఆర్ధికంగా వెనుకబడిన దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా..?

ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతి కొనసాగాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాలో మాట్లాడుతూ రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలను త్యాగం చేశారని, వారికి అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నదే తమ పార్టీ డిమాండ్ అని అన్నారు. ఆర్ధికంగా వెనుకబాటుని ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకోవటమేంటని, అక్కడ ఈ రాజధానుల విషయమై ప్రధాని చేసిన ప్రకటన వైసిపి నేతలు చూడలేదని ఏపీకి మూడు రాజధానులు ఏ మాత్రం ప్రయోజనకరం కాదని నిపుణులు చెపుతున్నా, వికేంద్రికరణ పేరుతో మూడు రాజధానులు ఎందుకు కావాలనుకుంటున్నారో జగన్ ప్రజలకు సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.
రాజధాని అమరావతి నిర్మాణంతో తమకేం సంబంధంలేదంటూ బిజెపి రాజ్యసభసభ్యులు చేసిన వ్యాఖ్యలపైనా ఆయన మండి పడ్డారు. కేంద్రం ఈ రాజధాని అమరావతి ఆవిర్భావం నుంచి నిధులు అందజేస్తోంది. ఈ ప్రాంతంలో కేంద్ర సంస్ధల కోసం భూములు తీసుకుంది. అలాంటప్పుడు కేంద్ర భాగస్వామి కాకుండా ఎందుకు పోతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రం కూడా వెంటనే జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. రాజధానిని ఇష్టానుసారంగా మార్చాలనుకోవడం తప్పుడు సంప్రదాయమని, తుగ్లక్ చర్య అని వ్యాఖ్యానించారాయన.
ప్రతిపక్ష పార్టీ నేతలను తమకు నచ్చిన విధంగా అరెస్టులు చేయాలని జగన్ ప్రభుత్వం అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోందని, ఈ వరుస ఇంకా కొనసాగితే ఏపిలో ఉద్యమాలు మరింత తీవ్రమవుతాయని రాజా హెచ్చరించారు.