డ‌బ్బు పెట్ట‌కుండానే..పేరుబ‌లంతో డ‌బ్బులు

ఒక స్థాయికి వచ్చిన తర్వాత రాయల్టీ రూపంలో పెట్టుబడి లేకుండానే డబ్బులు వస్తూ ఉంటాయి. ఒక పేరు వాడుకున్నా లేదంటే ఏదైనా బ్రాండ్‌కు తమ పేరు వాడుకున్నా కూడా రాయల్టీ రూపంలో ఆయా వ్యక్తులకు భారీగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు సుకుమార్‌ కూడా భారీగా రాయల్టీలు దక్కించుకుంటున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ అనే బ్యానర్‌లో సుకుమార్‌ సినిమాలు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలకు సుకుమార్‌ పెద్దగా ఖర్చు పెట్టరు. వేరే వారితో ఖర్చు పెట్టిస్తారు, లాభం వస్తే అందులోంచి షేర్‌ తీసుకుంటున్నారు.

కుమారి 21ఎఫ్‌, దర్శకుడు చిత్రాలను నిర్మించిన సుకుమార్‌ ప్రస్తుతం మైత్రి మూవీస్‌ వారితో మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుక సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో శరత్‌ మరార్‌ నిర్మాణంలో ఒక సినిమా రూపొందబోతుంది. ఆ సినిమాకు కూడా సుకుమార్‌ నిర్మాణ భాగస్వామి అయ్యారు. నాగశౌర్య హీరోగా రూపొందబోతున్న ఆ సినిమాకు సుకుమార్‌ శిష్యుడు దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ రెండు సినిమాలకు కూడా సుకుమార్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ చేశారు. అంతకు మించి డబ్బులు పెద్దగా పెట్టింది లేదు. అయినా కూడా లాభాల్లో దాదాపుగా ముప్పై శాతంకు పైగా వాటాను సుకుమార్‌కు ఇచ్చేందుకు నిర్మాతలు మైత్రి మూవీస్‌ వారు మరియు శరత్‌ మరార్‌లు ఓకే చెప్పారు. ఎందుకంటే సుకుమార్‌ పేరు పోస్టర్‌ పై ఉంటే సినిమాకు ఎక్కువగా టికెట్లు తెగుతాయి. చిన్న సినిమా కాస్త పెద్ద సినిమా అవుతుంది. అందుకే సుకుమార్‌ పేరుకే బాగా డబ్బులు వస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్‌ తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో చేసేందుకు సిద్దం అయ్యారు. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుంది.

Leave a Reply

Your email address will not be published.