కేబినెట్లోకి ముఖ్యమంత్రి కుమారుడు?

ముంబై: మహారాష్ట్ర సర్కార్‌లో మరో కీలక పరిణామం జరగబోతోంది. ఎన్నో ఉత్కంఠ పరిణామాల తర్వాత ఏర్పడిన మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణకు వేళైంది. కొద్ది సేపట్లో ముంబైలోని విధాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అయితే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. తన కుమారుడ్ని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు అజిత్ పవార్ కూడా చక్రం తిప్పబోతున్నట్లు సమాచారం. మరి కేబినెట్ పదవి దక్కే ఆ నేతలు ఎవరు..? ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించనున్నారు..? మహా రాజకీయాల్లో కీలకంగా మారిన అజిత్ పవార్ భవితవ్యం ఏంటీ..? సీఎం కుమారుడు ఆదిత్య ఠాక్రేను కేబినెట్లోకి తీసుకుంటారా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మళ్లీ డిప్యూటీ సీఎంగా..
మహారాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారి.. అనూహ్య పరిణామాలకు కారణమైన ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు తాజా కేబినెట్లో చోటు దక్కనుంది. దేవేంద్ర ఫడణవీస్ మూడు రోజుల ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న అజిత్‌కు.. మళ్లీ అదే పదవి ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఉదయం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో అజిత్ భేటీ అయ్యారు. అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఆదిత్య ఠాక్రేకు మంత్రి పదవి..
ఇక ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన శివసేన యువనేత, సీఎం ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రేను కూడా కేబినెట్లోకి తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు పర్యావరణం లేదా ఉన్నత విద్యాశాఖ కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి వీరే..
మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టే నేతల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. సీనియర్ నేతలు అశోక్ చవాన్, కేసీ పాడ్వీ, విజయ్ వదెత్తివార్ సహా అమిత్ దేశ్‌ముఖ్, సునిల్ కేదార్, యశోమతి ఠాకూర్, వర్షా గైక్వాడ్, అస్లామ్ షేక్, సతేజ్ పటేల్, విశ్వజీత్ కదమ్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు వెల్లడించింది.