ప‌వ‌న్‌కు రాపాక ఝ‌ల‌క్‌- ఇంగ్లీష్ మీడియం భేషన్న ఎమ్మెల్యే


ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పని సరి చేయడంపై పోరాటానికి శ్రీ‌కారం చుట్టిన  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్ప‌టికే ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వ‌స్తుంటే  ఆ పార్టీకి చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. బుధ‌వారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. జగన్ తీసుకున్న ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని స్వాగతించి, పవన్ కు షాక్ ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.
గ‌త  చంద్రబాబు నాయుడి సర్కారు మధ్యలో వదిలేసిన ఇంగ్లిష్ మీడియం ప్రయత్నాలను జగన్‌ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తుండ‌టం హ‌ర్ష‌ణీయమ‌ని,  ఈ మంచి నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని, పేద విద్యార్థుల కోసం వైసీపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించడంతో అధికార ప‌క్షం బ‌ల్ల‌లు చ‌రుస్తూ హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేసారు. 
కాగా రాజోలు నుండి రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించి, ఆ పార్టీలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఉన్నారు. గ‌త కొంత కాలంగా ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తోన్న తీరు చూస్తుంటే ఆయన పార్టీ మారతారా? అన్న అనమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిని కొట్టి పారేసిన తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే తన నంబర్ 152గా నిలుస్తానని, అదే జనసేనలో ఉంటే తన నంబర్ 1గా ఉంటానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 
అయితే తెలుగు భాష పరిరక్షణ కోసం  పోరాటాన్నే ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యాన్ని సొంత పార్టీ శాస‌న‌భ్యుడే వ్య‌తిరేకిస్తున్నాడ‌ని, ఆత‌ని ఒర‌వ‌డి మార్చుకోవాలంటూ వైసిపి  తాజా వ్యాఖ్య‌లను ఉద‌హ‌రిస్తూ మాట్లాడుతోంది. 

Leave a Reply

Your email address will not be published.