‘ఖర్చు ఇండియాకు.. కిక్కు పాకిస్తాన్ కు’కొత్త‌ల్లుడొస్తున్నాడ‌ని ఇల్ల‌లికి , ఇంటిముందు కళ్ళాపు చ‌ల్లి ముగ్గే పెడితే… కోడి వ‌చ్చి ఏదో చేసింద‌ట‌. .. అలానే ఉందిప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కారు ప‌రిస్థితి, అమెరికా అధ్య‌క్షుడుని భార‌త్‌కు ఆహ్వానించింది మొద‌లు తెగ హ‌డావిడి చేసి, చివ‌ర‌కి అహ్మ‌దాబాద్‌లో ట్రంప్ ప్ర‌యాణించేదారుల్లో రోడ్ల‌కిరువైపులా గోడ‌లు క‌ట్టించేసి, పేద‌రికాన్ని దాచేసింది.  ఎంతో శ్రమకోర్చి   అట్టహాసంగా ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ నిర్వహిస్తే..  ట్రంప్‌గారు మాత్రం పాక్ అంటే మండి ప‌డే మోడీ స‌ర‌స‌నే నిల‌బ‌డి మ‌రీ  పాకిస్తాన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ప‌నిలో ప‌నిగా ఇండియాలో డైవర్సిటీపైనా ప్రధాని మోడీకి చురకలు వేశారు  ఇది మంగ‌ళ‌వారం పాకిస్థాన్‌లోని   ప్రధాన పత్రికలలో వ‌చ్చిన వార్తాంశాల సారాంశం. చిన్నా చిత‌కా ప‌త్రిక‌లు కూడా  ఇదే తరహా వార్తల్ని ప్రచురించ‌డంతో పాటు భార‌త్‌లో న‌డిబోడ్డున  నిల‌బ‌డి  పాకిస్తాన్ తో దోస్తీ కొనసాగిస్తామంటూ  ట్రంప్ వ్యాఖ్యలను పాక్ మీడియా  చాలా పెద్ద హైప్ క్రియేట్ చేసిప‌డేస్తోంది.  వెబ్ సైట్లయితే ‘ఖర్చు ఇండియాకు.. కిక్కు పాకిస్తాన్ కు… అంటూ తెగ ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. 

పాక్‌లోని ప్రధాన పత్రిక ‘ది న్యూస్ ఇంటర్నేషనల్‌.. ‘‘పాకిస్తాన్ తో దోస్తీ కొనసాగిస్తామన్న ప్రకటనతో ట్రంప్.. మోతేరా స్టేడియంలోని లక్షమందికి ఒకేసారి షాక్‌”అని  ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అలాగే పాక్ ప‌త్రిక‌ల‌లో అతి పెద్ద‌దైన డాన్ కూడా‘ఇండియా గడ్డపై నిలబడి పాకిస్తాన్‌ను పొగిడిన ట్రంప్ అని ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురిస్తూ,  సెక్యూలరిజం మాటున మోడీ చేస్తున్న వ్య‌వ‌హారాల‌ని ప‌రిశీలించి ట్రంప్ మోడీకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారని  పేర్కొంది. 

సోమవారం నాటి ట్రంప్ ప్రసంగంతో ఇంత కాలం డీలాగా ఉన్న‌ ఇమ్రాన్ ఖాన్ సర్కారుకు..  ఎక్కడలేని జోష్ వచ్చినట్లు పాక్ మీడియా పేర్కొంది. ఇండియాలో నమస్తే ట్రంప్ ఈవెంట్ ముగిసిన తర్వాత.. పాక్ ప్రధాని కార్యాలయంలోనూ చిన్నపాటి సంబురాలు జరుపుకున్నట్లు తెలుస్తోంది.  .

Leave a Reply

Your email address will not be published.