“భారత్ తో భారీ డీల్” అంటున్న ట్రంప్ నిజమేనా….?

నేటి నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సకుటుంబ సపరివార సమేతంగా భారత్ తో పర్యటించనున్నారు. ఇప్పటికే ఈ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లను భారత్ – అమెరికా దేశాలు పూర్తి చేశాయి. ట్రంప్, మినిట్ టు మినిట్ ప్రోటోకాల్ తో సహా పక్కా షెడ్యూల్ తో సర్వం సిద్ధమైంది. అమెరికా నుండి బయలుదేరిన దగ్గర్నుండి తిరిగి అమెరికాలో అడుగు పెట్టె వరకు భారీ భద్రత ఏర్పాట్లు నడుమ ఈ పర్యటన సాగనుంది. ఈ రెండురోజుల ట్రంప్ పర్యటన కోసం భారత ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెడుతోంది. మరే అంశానికీ ఇవ్వనంత ప్రాధాన్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది.అయితే ట్రంప్ పర్యటనకు మోడీ సర్కార్ వందల కోట్లు ఖర్చు చేస్తుండటంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ట్రంప్ టూర్ వల్ల అమెరికాకే తప్ప భారత్‌కు ప్రయోజనం ఏమీ ఉండదని మండిపడుతున్నాయి.
ట్రంప్ రాక భారత్ కి ఎంత వరకు మేలు చేస్తుంది? ఏయే రంగాలతో, ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు,. దిగుమతులు, ఎగుమతులు , పెట్టుబడులు ఏమైనా పెరుగుతాయా..? ఉద్యోగ అవకాశాలు పెరిగే పరిస్థితి ఏంటి? వీసా విషయాలలో ట్రంప్ ఏం చెప్తారు ఇలా అనేకమైన ఆసక్తికర విషయాలపై ఇప్పుడు భారత్‌లో వాణిజ్య వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య రంగంలో వృద్ధి 2018లో 142 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ వృద్ధిని మరింతగా పెంచాలని భారత్ భావిస్తుంది. అమెరికా నుండి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా, ఇప్పటికే 20-25బిలియన్ డాలర్ల సర్ ప్లస్ ఉన్న ఎగుమతులను మరింతగా పెంచాలని , తద్వారా యువతకి ఉపాధి కల్పించడంతో పాటు దేశీయ వస్తు సేవల ఉత్పత్తిని మరింత పెంచుకునే అవకాశం దక్కుతుంది.
అమెరికా దగ్గర ఉన్నంత పటిష్టమైన రక్షణ రంగం ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేదన్నది వాస్తవం. ఇప్పటికే ఫ్రెంచ్, యూరప్, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో రక్షణ రంగాలలో సత్సంబంధాలు కొనసాగిస్తునే వ్యూహాత్మకంగా వ్యవహరించి అమెరికా సహకారంతో భారత్ రక్షణ రంగాన్ని పటిష్టం చేయటం, ఆధునాతన ఆయుధాలని దిగుమతి కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
ఇక గత కొంత కాలంగా అమెరికా- చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య వార్ కారణంగా అమెరికా, చైనా ని నేరుగా ఎదుర్కోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో 4లక్షల బిలియన్ డాలర్లు వాణిజ్యలోటు ఏర్పడింది. దీనిని పూడ్చుకునేందుకు భారత్ ని వ్యూహాత్మంగా ఉపయోగించుకోవాలని అమెరికా చూస్తున్న నేపథ్యంలో ఎగుమతులకు ఆస్కారం కలుగుతుంది. ఇది భారత్ కి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. అయితే ఇప్పటికే 20-25 బిలియన్ డాలర్ల లోటుతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఎగుమతులు, దిగుమతుల వాణిజ్యం ఉంది. దానిని తగ్గించడం కోసం ఎగుమతులను పెంచాలని అమెరికా భావిస్తున్న నేపథ్యంలో డైరీ ప్రోడక్ట్స్, చికెన్ లెగ్స్ ఎగుమతులు పెరిగే ఆస్కారం ఉంది.
కీలకమైన జమ్మూకాశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కి అనుకూలంగా మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలిచే అవకాశాలు మెరుగు పరచుకునేందుకు తాజా పర్యటన లో భారత్ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయని వినిపిస్తోంది.
భారత్ నుండి అమెరికాకు వస్తున్న వలసదారుల విషయంలో అమెరికా ఇప్పటికే ఉక్కుపాదం మోపింది. వీసాల రూల్స్ ని మరింత కఠినతరం చేయాలనీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ విషయంలో మౌనం వహించడం ద్వారాఈ ఏడాది చివర్లో అమెరికాలో జరుగనున్న ఎన్నికలలో లబ్ది పొందాలన్నది ట్రంప్ ఆలోచన. ఎందుకంటే అమెరికాలో దాదాపు 30 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అందులో సంగం మందికి అమెరికాలో ఓటు హక్కు ఉంది. వారిని తన పార్టీకి అనుకూలంగా మార్చుకుంటే ట్రంప్ కి మరింత మేలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆయనకి రాజకీయ అవసరం తీర్చే అంశం.
ఇక వ్యక్తిగతంగా కూడా ఈ టూర్ ని ట్రంప్ వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ట్రంప్ టవర్స్ పేరుతో భారత్ లో ఆకాశ హరమ్యాలను నిర్మించే పనిలో ట్రంప్ కుటుంబం పనిచేస్తోంది. . ఇందుకు చాలా పెట్టుబడులు పెట్టింది. ముంబై,ఢిల్లీ వంటి చోట్ల ట్రంప్ కుటుంబం తాము చేస్తున్న ఈ వ్యాపారాలకు బూస్ట్ ఇచ్చేలా పర్యటన సాగనుంది.
ఈ క్రమంలోనే భారత్ పర్యటనలో “కెమ్ ఛో ట్రంప్” కార్యక్రమాన్ని అందుకు అనుకూలంగా వాడేసుకునే ఆస్కారం కనిపిస్తోంది. “భారత్ తో భారీ డీల్” అంటున్న ట్రంప్ మాటలలో నిజమెంత తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సి ఉంటుంది.