హ‌మ్మ‌య్య‌… గెలిచాం…


ఇప్ప‌టి వ‌ర‌కు తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్న కర్ణాటకలోని  యడియూరప్ప నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం తాజా ఉప ఎన్నిక‌ల‌తో పూర్తి స్ధాయి అధికారాన్ని నిలబెట్టుకునే అవ‌కాశం అందుకుంది. 15 శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి అవసరమైన 7 స్థానాలు ద‌క్కేందుకు స్ప‌ష్ట‌మైన అవ‌కాశాలు క‌నిపించ‌డంతో  బిజెపి  కార్యకర్తలు సంబరాలు ప్రారంభించారు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఇప్ప‌టికే క‌మ‌లం పార్టీ సునాయాసంగా ఆరు చోట్ల విజయం సాధించగా.. మరో ఆరు చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి చెందిన 17 మంది తిరుగుబాటు చేయడంతో కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అప్పటి స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేయడం.. బలపరీక్షలో భాజపా నెగ్గి యడియూరప్ప సర్కార్‌ ఏర్పాటు కావ‌టం జరిగిన విష‌యం తెలిసిందే. కాగా వేటు ప‌డిన వారు సుప్రీంని ఆశ్ర‌యించ‌గా స్పీక‌ర్ నిర్ణ‌యం స‌హేతుక‌మైన‌దే నంటూ తేల్చి చెప్ప‌డంతో ఉప ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి.

ఎమ్మెల్యేల అనర్హతతో 17 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. హైకోర్టులో కేసుల కారణంగా రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డగా, 15 స్థానాలకు  డిసెంబరు 5న ఉప ఎన్నికలు జరిగాయి. బిజెపి అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఉప ఎన్నికల్లో కనీసం ఆరు చోట్ల గెలవాల్సి ఉండ‌గా ఇప్పటికే ఆ సంఖ్య దాట‌డంతో బిజెపి వ‌ర్గాల‌లో ఆనందానికి అంతే లేకుండా పోయింది.

Leave a Reply

Your email address will not be published.