అమరావతి కి టిడిపి చేసిందేం లేదు : మంత్రి బొత్స

గత ప్రభుత్వం రైతుల భూముల లాక్కుని, రాష్ట్రానికి అప్పులు, వడ్డీలు పెంచిందే తప్ప రాజధాని అమరావతిలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ సీఆbర్డీఏ పేరుతో అప్పులు తెచ్చి పసుపు-కుంకుమకు పంచేశారని ఆరోపించారు. రాజధాని బాండ్లు, హడ్కో ల నుంచి పొందిన రుణాలు ఏమైపోయాయో తెలియట్లేదని, ఇందుకు గానూ ఇప్పటికి రూ.330కోట్ల వడ్డీ చెల్లించామన్నారు. కాగా తమను మోసం చేశారంటూ రాజధాని రైతులు ప్రస్తుత ప్రభుత్వం వద్ద మొర పెట్టుకుంటున్నారని, గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలను మంత్రుల వద్దకు వచ్చి చెపుతున్నారన్నారు. రాజధాని రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని, వీటికి సంబంధించిన ప్రణాళికలు తయారయ్యాయని మంత్రి వెల్లడించారు. అన్ని విధాలా రాజధాని రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు.
రాజధానిపై గతంలో చేసిన వ్యాఖ్యలకు, ప్రస్తుతం ప్రభుత్వం రాజధానిని అభివృద్ధి చేయాలన్న నిర్ణయం విషయమై ప్రశ్నిస్తే…. అన్ని విషయాలు తరువాత మాట్లాడతానంటూ మీడియానుంచి తప్పించుకున్నారు బొత్స.