‘హీరో నిఖిల్‌ క్షమాపణ చెప్పాలి’

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కొద్ది రోజులుగా ‘ముద్ర ’అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. టీఎన్‌ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా తన సినిమా లోగో, పేరు వాడుకొని మరో సినిమా విడుదల చేస్తున్నారంటూ నిఖిల్‌ సోషల్‌ మీడియాలో మండిపడ్డ సంగతి తెలిసిందే. (‘నా సినిమా రిలీజ్ లేదు.. కావాలనే ఇలా చేశారు’)

తాజాగా నిఖిల్‌ కామెంట్లపై నిర్మాత నట్టి కుమార్‌ స్పందించారు. ముద్ర సినిమా టైటిల్‌ తనదేనని  పునరుద్ఘాటించారు. టైటిల్‌ తనది అనడానికి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. నిఖిల్‌ నిర్మాతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టైటిల్‌ తనది అని నిఖిల్‌ నిరూపించాలని.. లేకపోతే సినిమాల నుంచి వెళ్లిపోవాలని సవాల్‌ చేశారు.

సినిమా విడుదలయ్యే సమయంలో సినిమా చూడోద్దని నిఖిల్‌ ఎలా చెబుతారని ప్రశ్నించారు. చిన్న నిర్మాత అయితే ఏదైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి అని నిలదీశారు.అసభ్యపదజాలంతో నిర్మాతలను తిడతారా అని మండిపడ్డారు. సోమవారంలోపు నిఖిల్‌ క్షమాపణ చెప్పాలని.. లేకపోతే ఆయన బండారం బయటపెడతానని హెచ్చరించారు. ఈ విషయంపై ఎమర్జెన్సీ మీటింట్ పెడుతున్నామని.. అన్ని తేలేవరకూ నిఖిల్‌ సినిమా ఆపేయాలని డిమాండ్‌ చేశారు.

ముద్ర అనే టైటిల్‌తో జగపతిబాబు ప్రధాన పాత్రలో ఎన్.కె. దర్శకత్వంలో క్యూటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నట్టి కుమార్  సినిమాను నిర్మించారు. లోగో కూడా నిఖిల్ సినిమాకు చేసినట్లే డిజైన్ చేసారు. దీంతో నిఖిల్ సినిమా అనుకుని జగపతి బాబు సినిమాకు నెటిజన్లు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.

విషయం తెలుసుకున్న నిఖిల్‌ సోషల్ మీడియా పేజ్‌లో ‘ఈ వారం నా సినిమా రిలీజ్ కావటం లేదు. కొంత మంది వ్యక్తులు కావాలనే నా సినిమా టైటిల్‌ను సేమ్‌ డిజైన్‌తో వాడుకున్నారు. టికెట్ బుకింగ్‌ యాప్‌లో నా పేరును కూడా వాడుతున్నారు. మా నిర్మాతలు ఆ వ్యక్తులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా’ అని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ముద్ర సినిమా నిర్మాణకార్యక్రమాలు జరుపుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published.