డిజిటల్ పంచ్…… టాలీవుడ్ కి లాభమా? నష్టమా?

అసలే  సక్సెస్ రేటు అంతంత మాత్రంగా ఉండే వినోదపరిశ్రమకు డిజిటల్ రూపంలో పెద్ద ప్రమాదం ఎదురవుతోందా? అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజాలు టాలీవుడ్ నెత్తిన శఠగోపం పెడుతున్నాయా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. సినిమా తీసేది ఒకడు.. కొనేది ఇంకొకరు.. వాటిని క్యాష్ చేసుకునేది వేరొకడు! అన్న చందంగా సన్నివేశం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పర్యవసానం డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లకు గుండె పోటు తెప్పిస్తోంది. డిజిటల్ వల్ల ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే అమెజాన్ లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తే ఆ సినిమాని కొనుక్కున్న బయ్యరు, పంపిణీదారుల పరిస్థితేంటి?  డిజిటల్ వెల్లువ టాలీవుడ్ కి లాభమా? నష్టమా?.. అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.

డిజిటల్ రాక వినోద రంగంలో ఓ పెనువిప్లవం. ఈ విధానం సినిమా వ్యూవర్‌షిప్‌ని అమాంతం మార్చేసింది. సినిమా థియేటర్ లో రిలీజైన నాలుగు వారాల(నెల)కే అమెజాన్ లో లైవ్ చేసుకునే వీలు కల్పిస్తూ చట్టం రూపొందించడం పంపిణీదారుల పాలిట శాపం అయ్యిందనే ఆవేదన కనిపిస్తోంది. నోటి దగ్గర కూటిని లాక్కునేలా.. నాలుగు వారాల కటాఫ్ నియమం బెంబేలెత్తిస్తోందని పలువురు వాపోతున్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అమెజాన్ బిగ్ సక్సెస్ అయ్యింది. దీని వల్ల నిర్మాతలకు భారీ మొత్తాలు ముడుతున్నాయి. అంతా బాగానే ఉన్నా.. నిర్మాతల నుంచి కొనుక్కున్న బయ్యరు పరిస్థితేంటి?  డిస్ట్రిబ్యూటర్ ఏమైపోవాలి? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ సంక్రాంతి బరిలో రిలీజైన నాలుగు సినిమాలు  డిజిటల్ లో లైవ్ కి వచ్చేస్తున్నాయి. జనవరి 8న రిలీజైన కథానాయకుడు, 9న రిలీజైన పేట, 10న రిలీజైన వినయ విధేయ రామ చిత్రాలు డిజిటల్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. వీటితో పాటు జనవరి 11న రిలీజై బంపర్ హిట్ కొట్టిన ఎఫ్ 2 చిత్రం అమెజాన్ లో లైవ్ కి వచ్చేస్తోంది. మిగతా సినిమాలు ఫ్లాపైనా, ఎఫ్ 2 ఘనవిజయం సాధించి ఇంకా థియేటర్లలో ఆడుతున్నా.. ఇప్పటికే అమెజాన్ లో లైవ్ కి వచ్చేస్తోందని ప్రకటించేశారు. దీనివల్ల సక్సెస్ టాక్ విన్న తర్వాతే థియేటర్ కి వెళ్లాలనుకున్న ప్రేక్షకులంతా ఇప్పుడు అమెజాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో డిజిటల్ వర్ధిల్లుతోంది.

మూవీ పాస్ తరహాలో అమెజాన్ ప్రైమ్ అనేది ఓ విప్లవాత్మకమైన కాన్సెప్ట్. ఇది కొందరికి మోదం.. కొందరికి ఖేదం! అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినిమాల్ని కొనుక్కున బయ్యరు నెత్తిన చెంగేసుకుని పోయే విప్లవం ఇదన్న విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. ఈ పర్యవసానం మునుముందు సినిమా ట్రేడ్ పై తీవ్ర ప్రభావం చూపించనుందన్న వాదనా వినిపిస్తోంది. నిర్మాత సేఫ్.. అమెజాన్ సే.. ఈ గేమ్ లో స్కేప్ గోట్ ఎవరు? అన్నది ప్రధానంగా చర్చకొచ్చింది.

అమెజాన్‌లో సంక్రాంతి సినిమాలు
సంక్రాంతి బరిలో వరుసగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. జనవరి 9న కథానాయకుడు, 10న పేట, 11న వినయ విధేయ రామ, 12న ఎఫ్ 2 చిత్రాలు రిలీజయ్యాయి. వీటిలో ఎఫ్ 2 ఒక్కటే బ్లాక్ బస్టర్. మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులయ్యాయి. ఫ్లాపు సినిమాలు వదిలేసి, హిట్టు సినిమాలు మాత్రమే చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ప్రస్తుతం డిజిటల్ మాధ్యమంలో సంక్రాంతి సినిమాల లైవ్ ఎప్పుడు అంటూ తేదీల గురించి సెర్చ్ చేస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి సినిమాలన్నీ వరుసగా క్యూ కడుతున్నాయి. ప్రఖ్యాత ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ మన తెలుగు సినిమాలన్నిటినీ గంప గుత్తగా కొనేసి డిజిటల్ రిలీజ్ లకు తేదీల్ని ఖాయం చేసింది.

ఎన్నో భారీ అంచనాల నడుమ రిలీజై ఫ్లాప్ సినిమాగా నిలిచిన కథానాయకుడు చిత్రాన్ని నేటి నుంచి అమెజాన్ లైవ్ లోకి తెచ్చింది. అలాగే ఫిబ్రవరి 10 నుంచి వినయ విధేయ రామ అమెజాన్ లో లైవ్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఇంకా ఈ సినిమా నష్టాల గురించి .. దర్శకనిర్మాతల మధ్య ఘర్షణ గురించి చర్చ సాగుతుండగానే అప్పుడే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోతుండడం మెగాభిమానుల్లో చర్చకొచ్చింది. మరోవైపు ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 కూడా ఫిబ్రవరి 11న డిజిటల్ లో రిలీజైపోతోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం అద్భుతమైన ఫన్ తో ఆకట్టుకుని ఇప్పటికీ విజయవంతంగా ఆడుతోంది. ఈలోగానే డిజిటల్ లో లైవ్ కి వచ్చేస్తోంది.
మరోవైపు అద్భుతమైన విజువల్ గ్రాఫిక్స్ తో అండర్ వాటర్ సినిమాగా సంచలన విజయం సాధించిన ఆక్వామేన్ చిత్రం మార్చి 3 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. అలాగే బ్లూరే డీవీడీలు మార్చి 26 నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇక సినిమాల్ని థియేటర్లలో చూడలేని వాళ్లు అమెజాన్ సహా డిజిటల్ స్ట్రీమింగ్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే దీనివల్ల పెద్దంత నష్టమేమీ లేదని వాదించేవాళ్లు లేకపోలేదు. అయితే డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి? అన్నది విశ్లేషించాల్సి ఉంటుందని పలువురు ప్రముఖ పంపిణీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సినిమాలు థియేటర్లలో ఆడుతుండగానే డిజిటల్ స్ట్రీమింగ్ సరికాదన్న వాదన వినిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.