వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర మంగ‌ళ‌వారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా నిర్వ‌హించారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించారు.. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి తిరుప‌తి జెఈవో   పి.బసంత్‌కుమార్ దంప‌తులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఆభరణాలు అందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా గరుడసేవ నాడు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకు వ‌చ్చామ‌ని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సుమారు రూ.50 ల‌క్ష‌లు విలువైన 983.750 గ్రాముల బరువు గల ఆభరణాలను బ‌హూక‌రించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇందులో 529.750 గ్రాముల బ‌రువైన ప్ర‌భ ఆకారం క‌లిగిన ర‌త్నాలు చెక్కిన బంగారు తిరుక్కోర‌ము, 454 గ్రాముల బ‌రువు గ‌ల 2 వ‌జ్రాల భావ‌లీలు ఉన్నాయ‌ని వివ‌రించారు. 


ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం, ఆభరణాలను తిరుమల శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో   హరీంద్రనాథ్‌, పేష్కార్ లోక‌నాథం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనానికి తీసుకొచ్చారు. 


ఈ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్రసాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

Leave a Reply

Your email address will not be published.